Indiramma houses | ధర్మారం, జూన్22: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కకుండా పోయాయి. దీంతో నిరుపేదలు నిరాశ చెందుతున్నారు. ఒకరికి ఇందిరమ్మ ఇంటి మంజూరు కాగా వారిని జాబితా నుంచి తొలగించారు. మరో ఇద్దరు నిరుపేదలు శిథిలావస్థలో ఉన్న గూన ఇంటిలో నివసిస్తుండగా అర్హులైన వారికి ఇల్లు మంజూరు కాలేదు. అధికారుల తీరు వలన తాము నష్టపోయామని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ పథకంలో తమకు ఇండ్లు మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు , రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.
వివరాలలోకి వెళితే… ఆ గ్రామానికి చెందిన అలువాల భాగ్యలక్ష్మి, లక్ష్మణ్ దంపతులు నిరుపేదలు. వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వారికి నిరుపేద కుటుంబం. లక్ష్మణ్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లక్ష్మణ్ గతంలో పూరి గుడిసెలో నివసించేవాడు. 13.11.2019 లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి పూరి గుడిసె కాలిపోయింది. మొత్తం గుడిసెలో ఉన్న సామాగ్రి కాలిపై సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లింది. దీంతో నిలువ నీడ లేకపోవడంతో లక్ష్మణ్ అతని తల్లి ఇంటిలో ఇద్దరు దంపతులు తత్కాలికంగా నివాసం ఉన్నారు. అనంతరం అతని భార్య భాగ్యలక్ష్మి తండ్రి వారి దీనస్థితిని చూసి కాలిపోయిన ఇంటి పక్కన ఒక రేకుల షెడ్డు నిర్మించి ఇవ్వడంతో వారు అందులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ద్వారా కొత్త ఇల్లు నిర్మించుకోవాలని వారు ఆకాంక్షతో ఉన్నారు.
ఈ క్రమంలో భాగ్యలక్ష్మి గ్రామంలో జరిగిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు పెట్టింది. ఆమె పేరు తుది జాబితాలో వచ్చింది. తమ సొంత ఇంటి కల నెరవేరుతుందని సదరు దంపతులు సంబురపడ్డారు. కానీ వారికి సంబరం అనేది నిరాశగా మారిపోయింది. గత 20 రోజుల క్రితం గ్రామపంచాయతీ కార్యదర్శి వచ్చి ఇల్లు మంజూరైనందున ఇంటికి మార్కింగ్ చేస్తామని తాత్కాలికంగా ఉన్న రేకుల షెడ్డును తొలగించుకుని అందుకు సిద్ధం కావాలని చెప్పారు. దీంతో వారు కొత్త ఇంటి నిర్ణయించుకున్నారు.
తీరా ఇంటి ముగ్గు కోసే సమయంలో మీ ఇల్లు రద్దయిందని అధికారులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. మంజూరైన ఇల్లు ఎలా రద్దువుతుందని వారు గ్రామపంచాయతీకి వెళ్లి కార్యదర్శిని ప్రశ్నించారు. ఇల్లు కట్టమని నిరాకరించినందుకు అధికారులు మంజూరైన ఇంటిని రద్దు చేశారని జిపి కార్యదర్శి సమాధానం చెప్పినట్లు వారు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. అధికారుల వైఖరి వలన తమకు మంజూరైన ఇల్లు రద్దయిందని తిరిగి అట్టి ఇళ్లను మంజూరు చేసి తమ సొంత ఇంటి కల నెరవేర్చాలని భాగ్యలక్ష్మి, లక్ష్మణ్ విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరుపేద మరియమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరులో జరిగిన అన్యాయం
అదే గ్రామంలో నివసిస్తున్న మన్నే మరియమ్మ కూడా సొంతింటి కల నెరవేర లేకుండా పోయింది. ఆమెకు కొడుకు (28)కూతురు (20) ఉన్నారు. మరియమ్మ భర్త గత రెండు సంవత్సరాల క్రితం కిడ్నీ వ్యాధితో మరణించాడు. ఇంటి పెద్ద మరణించడంతో మరియమ్మ కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతుంది. ఎప్పుడో కట్టిన గూన ఇల్లు శిథిలావస్థకు చేరింది. రేపో.. మాపో.. కూలిపోయే స్థితిలో ఉంది. దీంతో విధిలేని పరిస్థితిలో మరియమ్మ తన ఇంటిపై కవర్లు కప్పుకొని తన ఇద్దరు కొడుకు కూతురుతో బిక్కుబిక్కుమంటూ అందులో నివసిస్తోంది. కాగా ఆమె కూడా ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం దరఖాస్తు చేసింది. కానీ ఆ పేదరాలికి ఇల్లు మంజూరు కాలేదు. ఎంతో ధీన స్థితిలో ఉన్నామని ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉందని తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని మరియమ్మ వేడుకుంటుంది.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు అన్నరు.. ఆ తర్వాత పేరు లేదన్నారు
అదే గ్రామంలో నివసిస్తున్న ముత్యాల లత, శ్రావణ్ కుమార్ దంపతులది కూడా నిరుపేద కుటుంబం. లత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసింది. మీకు ఇల్లు వస్తుందని చెప్పడంతో వారు సంతోషపడ్డారు. ఇంటి పైన ఉన్న కవర్ ను తొలగించుకొని కొత్త ఇంటి నిర్మాణం కోసం సిద్ధం కావాలని గ్రామపంచాయతీ కార్యదర్శి చెప్పినట్లు శ్రవణ్ కుమార్ తెలిపాడు. దీంతో శ్రవణ్ సంబరపడిపోయి కవర్ తొలగించుకొని కొత్త ఇంటి మార్కింగ్ కోసం ఎదురు చూశాడు. కానీ తుది జాబితాలో తన భార్య పేరు లేదని అధికారులు చెప్పారని శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో కట్టిన గూన ఇల్లు శిథిలావస్థలో ఉందని, అందులోనే భార్య తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నానని తన ఆవేదనను వెలిబుచ్చాడు. నిరుపేదనైన తనకు ఇల్లు మంజూరు చేసి అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
మంజూరైన ఇండ్లకు మార్కింగ్ చేస్తున్నాం.. : రవి, జీపీ కార్యదర్శి, దొంగతుర్తి
గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరైన ప్రకారం మార్కింగ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తన ప్రమేయం ఏమీ లేదు. అధికారులు మంజూరు చేసిన ప్రకారమే లబ్ధిదారుల స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోస్తున్నాం. గ్రామంలో అలువాల భాగ్యలక్ష్మి ఇంటి రద్దు విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంటికి మార్కింగ్ చేస్తానని తనతో పాటు అధికారులు వెళ్లి చెప్పగా తాత్కాలికంగా నివాసం ఉంటున్న రేకుల షెడ్డు ను తొలగించుకోవాలని చెప్పగా వారు నిరాకరించారు. అధికారులు ఇంటిని రద్దు చేశారు . నాపై వారు చేసిన ఆరోపణ నిరాధారమైనది. అర్హులైన వారికి ఇండ్ల మంజూరు గురించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తా.