మల్లాపూర్, ఆగస్టు 17 : రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి డీఏవో వాణి, ఎల్డీఎం రాము, ఏడీఏ లావణ్య, మండల పరిధిలోని పలు బ్యాంక్‌ల మేనేజర్లు హాజరయ్యారు. అయితే, మాఫీ కాని రైతులు అక్కడికి చేరుకుని దరఖాస్తులు ఇస్తూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు విడుతల్లో చేయకుండా, మళ్లీ ఇప్పుడు నాలుగో విడుత అనడం ఏంటని ప్రశ్నించారు. డీఈవో స్పందించి, నాలుగో విడుతలో 2 లక్షలకు పైగా రుణం కలిగిన రైతులు 2 లక్షల పైన ఉన్న నగదు ప్రభుత్వానికి చెల్లిస్తేనే మాఫీ వస్తుందని చెప్పడంతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
రుణమాఫీ కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నామని మండిపడ్డారు. ‘ఇప్పుడే 2 లక్షలపైన ఉన్న నగదు ఇప్పుడే ఇస్తం. వెంటనే మాకు మాఫీ చేస్తరా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ అరిగోస పెడుతున్నదని ధ్వజమెత్తారు. చివరికి మల్లాపూర్‌కు చెందిన రైతు ఏలేటి రాజరెడ్డి ఆగ్రహానికి లోనై, అధికారుల ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కిరణ్‌కుమార్ సిబ్బందితో చేరుకొని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేయగా, వారు ససేమిరా అన్నారు. చివరికి సమావేశం మధ్య నుంచే డీఏవో, బ్యాంక్ అధికారులు వెళ్లిపోయారు. డీఏవో కారులో వెళ్లేటప్పుడు సైతం రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఆమె కారుకు సైతం రైతులు అడ్డురావడంతో చేసేదేమీ లేక పోలీసుల వాహనంలో వెళ్లిపోయారు.
పైన పైసలు కడితేనే మాఫీ చేస్తుందా..?
రుణమాఫీ విషయంలో విడుతల పేరిట సర్కార్ కాలం వెల్లదీస్తున్నది. డీఏవో వాణి మేడం 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు ఆ మీది పైసలు కట్టి ఆ రసీదును వ్యవసాయశాఖ కార్యాలయంల అందిస్తేనే మాఫీ అయితదని చెప్పింది. నేను, నా భార్య కలిసి మల్లాపూర్ యూనియన్ బ్యాంక్‌ల 3 లక్షల మేర రుణం తీసుకున్నం. నేను ఇప్పుడు పైన ఉన్న లక్ష డీఏవో ముందు చెల్లిస్త. లేకుంటే ఇక్కడికి వచ్చిన ఎస్ఐకి ఇవ్వమన్నా ఇస్త. కానీ, నాకు మాఫీ ఎప్పుడు చేస్తరో క్లారిటీగా చెప్తరా? స్పష్టత ఇవ్వకుండా సర్కారు ఆగం చేస్తున్నది. అసలు లక్ష, 1.50 లక్షల రుణమాఫీనే ఇంకా చాలా మందికి కాలేదు. ఇప్పుడు ఏవో నిబంధనలు చెప్పి 2 లక్షల రుణం ఉన్న రైతులు మీది పైసలు కట్టాలి అని అనడం మోసం చేసినట్టే.
– ఏలేటి రాజరెడ్డి, రైతు (మల్లాపూర్)
ఒక్క రోజే 600 దరఖాస్తులు
ఇల్లంతకుంట, ఆగస్టు 17 : మూడో విడుతలోనూ రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. వ్యవసాయ కార్యాలయల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం ఇల్లంతకుంట వ్యవసాయ కార్యాలయంలో సుమారు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు తెలిపారు. మూడో విడుతలో 2 లక్షల రుణమాఫీ కానివారు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. రైతులు తీసుకున్న రుణం వడ్డీతో కలిపి 2 లక్షల పై చిలుకు ఉన్న వారికి కాలేదని, ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం మేరకు మిగతా రుణమాఫీపై స్పష్టత వస్తుందన్నారు.