స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కనుల పండువలా జరిగాయి. ఊరూవాడా పతాకావిష్కరణలు చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లో అధికారిక సంబురాలు అంబరాన్నంటాయి. ఆయాచోట్ల పతాక ఆవిష్కరణల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కరీంనగర్, ఆగస్టు 15 (నమసే తెలంగాణ)/ కలెక్టరేట్ : పంద్రాగస్టు వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఊరూరా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, వివిధ పార్టీలు, సంఘాల కార్యాలయాలు, విద్యాలయాలు, వ్యాపార కేంద్రాల్లో బాధ్యులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రధానంగా జిల్లాకేంద్రాల్లో అధికారిక వేడుకలను కనులపండువలా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో విప్ ఆది శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్ పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
అనంతరం ఆయాచోట్ల పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వివిధ వేషధారణలతో.. త్రివర్ణ పతాకాలతో భారతమాతను, స్వాతంత్య్ర సమరయోధులను కీర్తిస్తూ చిన్నారులు నృత్యాలు చేస్తూ, నాటికలు ప్రదర్శిస్తూ అకట్టుకున్నారు. కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఇతర ప్రభుత్వ అధికారులు, విద్యార్థులతో కలిసి బధిర భాషలో జాతీయ గీతాన్ని ఆలపించి మూగ మనసులపై తమకున్న అభిమానాన్ని ప్రదర్శించారు.
జిల్లాకేంద్రాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. కరీంనగర్ శివారు చింతకుంటలోని బీఆర్ఎస్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండాను ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య జాతీయ జెండాలను ఎగురవేశారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం. అన్నదాతల అభ్యున్నతికి రాజీ లేకుండా కృషి చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాం. అలాగే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నాం. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాం.
ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 18 వేల 397 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేశాం. గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థలకు 85 కోట్ల 24 లక్షలు చెల్లించాం. మొదటి విడుత ఇప్పటి వరకు 6244 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం.
అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాం. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేయిస్తున్నాం. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మహిళా సాధికారిత లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో అనేక అపథకాలు అమలు చేస్తున్నది. అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమవుతున్నాం. జిల్లాలో మహిళా సంఘాలు వ్యాపార రంగం వైపు అడుగులు పెడుతున్నాయి. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) ద్వారా రాజన్న భక్తులకు వేగంగా, సులువుగా దర్శనం, వసతి కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. విస్తరణ పనులకు కార్యాచరణ సిద్ధమవుతున్నది.