petrol and gas | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 9 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు నగరంలోని తెలంగాణ చౌకలో బుధవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి గ్యాస్ సిలెండర్ ను నెత్తిన పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలతో సామాన్యులపై పెను భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నా కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతుందని మండిపడ్డారు. పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన, ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి గుడిగందుల సత్యం, నాయకులు వర్ణ వెంకటరెడ్డి, భీమా సాహెబ్, నరేష్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.