Rasamai | తిమ్మాపూర్ రూరల్ , ఆగస్టు 9 : మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని సొసైటీల పరిధిలో యూరియాను అందుబాటులో ఉంచి
ప్రతీ రైతుకు యూరియా అందేట్లు చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. తిమ్మాపూర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు చెప్పులను లైన్లో పెడుతున్నారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడైనా రైతులు చెప్పులు లైన్లో పెట్టినట్లు ఒక్క ఫొటో అయినా చూపిస్తారా అంటూ సవాల్ విసిరారు. పదేళ్ల తర్వాత యూరియా కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులను మళ్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ యూరియా కొరత లేదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, రైతులను తాగుబోతులంటూ సంబోధించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రసమయి అన్నారు. చేతగాని ఎమ్మెల్యే బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
రైతు వేదికలో కూర్చొని రాజకీయాలు మాట్లాడిన సత్యనారాయణ అవి ఎవరు నిర్మించారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు 40 కి పైన యూరియా బస్తాలు తీసుకెళ్లలేదని, రైతుబంధు, రైతు బీమా ఎగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు కూడా చూస్తున్నామని అన్నారు. తాము మిడ్ మానేరు, రంగనాయక సాగర్, తోటపల్లి, అనంతగిరి ప్రాజెక్టులని పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరు అందించిన విషయాన్ని రసమయి గుర్తు చేశారు. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పుడు రైతులు ఏడుస్తున్నారని, సొసైటీల వద్ద పోలీసు బందోబస్తు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
అక్కడక్కడ అసంపూర్తిగా మిగిలిన కాలువలను పూర్తి చేయలేని అసమర్థునిగా ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సిద్ధం వేణు, రావుల రమేష్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, గంప వెంకన్న, మాతంగి లక్ష్మణ్, ఉల్లెంగుల ఏకానందం, పాశం అశోక్ రెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, రామిడి రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.