వారంతా గీతానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలో నిర్వహించే సభా వేదికల్లో అనర్గళంగా మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు స్కూల్ రేడియో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ విద్యార్థులు రాసిన కథలు, పొడుపు కథలు, కథలు, పాటలు, పత్రికల్లో వచ్చే ముఖ్యమైన కథనాలను పాఠశాల మధ్యాహ్న భోజనం సమయంలో వినిపించేవారు. అలాగే పాఠశాలకు వచ్చే ఉన్నతాధికారులతో ఇంటర్వ్యూలు చేయించి వారిలో భావప్రకటన సామర్థ్యాలు పెంపొందించేవారు. ఈ క్రమంలో స్కూల్ రేడియో ప్రోగ్రామ్‌కు సంబంధించిన కథనం ఇటీవల ‘ఎస్సీఈఆర్టీ’ మ్యాగజైన్లో ప్రచురితం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
న్యూస్ పేపర్లో వచ్చే కథనాలను తోటి విద్యార్థులకు చదివి వినిపించడం చాలా గొప్ప అనుభూతి. ఉపాధ్యాయులు మాకు ఇలాంటి చక్కటి అవకాశం కల్పించడం సంతోషకరం. స్కూల్ రేడియోలో ఇచ్చిన టాస్క్‌ను అందరితో కలిసి సమాచారాన్ని సేకరించేటప్పుడు పూర్తి స్థాయిలో దానిపై అవగాహన వస్తుంది. ఎలాంటి సందేహాలు ఉన్న ఉపాధ్యాయులు నివృత్తి చేస్తుంటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో స్కూల్రేడియో ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ప్రతి ఏడాది విద్యార్థులను ఐదుగురి చొప్పున గ్రూపులుగా విభజించి, వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ కథలు, పొడుపు కథలు, న్యూస్ పేపర్లో ముఖ్యమైన అంశాలను స్కూల్రేడియాలో మధ్యాహ్న సమయంలో వినిపిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన ఉన్నతాధికారులను ఇంటర్వ్యూ చేయడంతో వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) వారు ఏటా స్కూల్ లీడర్షిప్ అకడామీపై మ్యాగజైన్లో కథనాలు రాస్తుంటారు. ఈ క్రమంలో గీతానగర్ పాఠశాలలో నిర్వహిస్తున్న స్కూల్ రేడియో ప్రోగ్రాం గురించి గత జూలై 26న ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయులు చేరాల తిరుపతి, వెంకటరాములును అభినందించింది.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అత్యాధునిక వసతులతో మా పాఠశాల అభివృద్ధి జరిగింది. స్కూల్ రేడియో కార్యక్రమాన్ని మూడేండ్లుగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులు ప్రతిరోజూ వివిధ అంశాలను గురించి వాటి ఉపయోగంపై స్కూల్ రేడియో వివరిస్తున్నారు. విద్యార్థులకు తరగతి గదిలో బోధనతోపాటు ఆలోచనా శక్తిని చిన్ననాటి నుంచే పెంపొందించడమే మా ఉద్దేశం.
గతంలో అందరి ముందు మాట్లాడాలంటే భయంగా ఉంటుంది. స్కూల్ రేడియో ప్రోగ్రాం అమలు చేస్తున్నప్పటి నుంచి పలు అంశాలపై మైక్ ద్వారా అనర్గళంగా మాట్లాడుతున్నాం. కథలు, పొడుపు కథలను తయారు చేస్తున్నాం. ఉపాధ్యాయులు ఇచ్చిన అంశాలను సేకరించి తోటి మిత్రులకు స్కూల్రేడియోలో తెలియజేస్తున్నాం.
పాఠశాల స్థాయిలో నిర్వహించే సమావేశాల్లో విద్యార్థులు మాట్లాడలేని పరిస్థితి ఉండేది. ఇలాంటి స్థితిని అధిగమించి చిన్ననాటి నుంచే వారిలో భావప్రకటన సామర్థ్యాలను పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. తనతోపాటు ఉపాధ్యాయుడు వెంకటరాములు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూం. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరం. ఎస్సీఆర్టీ మ్యాగజైన్లో ప్రత్యేక కథనం ప్రచురణ కావడం ఆనందంగా ఉంది.