Godavarikhani | కోల్ సిటీ, జనవరి 29: ‘అమ్మా.. నీవు చూపిన దారి..నేర్పిన విలువలు ఈ జీవితమంతా నీవు నాకు మార్గదర్శకం, నీ జ్ఞాపకాలతోనే ముందుకు సాగుతా’ అని గోదావరిఖనికి చెందిన కోలిండియా క్రీడాకారుడు, సీనియర్ కళాకారుడు పోతుల చంద్రపాల్ ప్రతిన చేశాడు. ఆయన తల్లి సింగరేణి మాజీ వైద్య సహాయకురాలు దివంగత పోతుల సంపూర్ణమ్మ 5వ వర్ధంతి పురస్కరించుకొని ఆమె జ్ఞాపకార్థం గురువారం గోదావరిఖని బస్టాండ్ వద్ద గల రామగుండం నగరపాలక సంస్థకు చెందిన నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలో అనాథ తల్లుల మధ్య వేడుకగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని డయాలసిస్ బాధితులు, దివ్యాంగులు, వృద్ధులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైద్య రంగంలో సంపూర్ణమ్మ అందించిన సేవలను కొనియాడారు. తల్లి అడుగు జాడలో నడుస్తూ కోలిండియా స్థాయి క్రీడాకారుడిగా ఎదిగిన కుమారుడు చంద్రపాల్ తల్లి జ్ఞాపకార్థం ఆపన్నులకు చేయూత ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాలంకూస్, ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ, ప్రముఖ ఇంద్రజాలికులు మేజిక్ రాజా, నాగుల రాంమ్మోహన్, మేజిక్ హరి, సమ్మయ్య, ఉమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రపాల్ ను ఆశ్రమంలోని వృద్ధ మహిళలు ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలిపారు.