Rekonda | చిగురుమామిడి, మార్చి17 : కరీంనగర్ జిల్లాలో చేపట్టిన గాలికుంటు వ్యాధి టీకాల్లో భాగంగా 92,500 పశువులకు గాను 14.468 పశువులకు గాలికుంటు టీకాలు పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గాలికుంటు వ్యాధి టీకా శిబిరాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏప్రిల్ 9 వరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. పశువులకు ముఖ్యంగా నోరు చిగుళ్ళు, కాళ్ల గోల మధ్య పొక్కులు ఏర్పడి తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడతాయన్నారు. సొంగ కార్చడం, మేత మేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.
సంకరజాతి పశువుల్లో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యమైన పశువులకు గాలి, నీరు, మేత, పాలు (దూడలకు) వేగంగా వ్యాప్తిస్తుందన్నారు. గేదలు, ఆవులు, ఎద్దులు మూడు నెలలు దాటిన లేగ దూడలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ప్రతీ రైతు పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శిబిరంలో చిగురుమామిడి పశువైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, పశువైద్య సిబ్బంది శ్రీనివాస్, సత్యం, కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొనగా, ఓగులాపూర్ గ్రామంలో ఇందుర్తి పశువైద్యాధికారి సాంబారావు గాలికుంటు టీకా శిబిరంలో పాల్గొని సిబ్బందితో కలిసి పశువులకు టీకాలు వేశారు.