కాంగ్రెస్‌లో టికెట్ల కల్లోలం రేగుతున్నది. దశాబ్దాలుగా పార్టీ జెండాను మోసిన వారిని కాదని, ప్యారాచూట్ నాయకులకు ఇవ్వడంపై అగ్గి రాజుకున్నది. ఆదిలాబాద్‌లో ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్‌రెడ్డికి సీటు కేటాయించడంపై అట్టుడుకుతున్నది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఏకంగా సోమవారం ఆ జిల్లాకేంద్రంలో ‘సేవ్ కాంగ్రెస్ ఫ్రం ఆర్ఎస్ఎస్’ పేరిట సమావేశం నిర్వహించి, అధిష్టానం తీరుపై నిప్పులు చెరిగారు. తాను చనిపోతే ఆర్ఎస్ఎస్ కండువా కప్పాలన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ జోడో యాత్రలో ప్యారాచూట్ నాయకులకు టికెట్ ఇచ్చేది లేదన్న రాహుల్‌గాంధీ, ఇప్పుడెలా కేటాయించారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకుంటే శ్రీనివాస్‌రెడ్డి కొన్నారంటూ తీవ్రంగా ఆరోపించారు. అలాంటి వ్యక్తి కోసం పని చేసే ప్రసక్తే లేదని, ఆదిలాబాద్, బోథ్ అభ్యర్థులను మార్చకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు. అధిష్టానం నుంచి అనుకూలమైన నిర్ణయం రాకపోతే మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అల్లుడు సంజీవరెడ్డిని రెబల్‌గా బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. కాగా, బోథ్‌లో కూడా సీనియర్లను కాదని వన్నెల అశోక్‌కు టికెట్ ఇవ్వడంపై ఇచ్చోడలో భారీ ర్యాలీ తీసి నిరసన తెలిపారు. – ఆదిలాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ టికెట్ల పంచాయతీ రోజురోజుకూ ముదురుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆందోళనబాట చేపట్టారు. ఆదివారం ఆదిలాబాద్ నియోజకవర్గంలో మైనార్టీ నాయకులు రాజీనామాలు చేయగా, సోమవారం ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. ఇచ్చోడలో ర్యాలీ తీసి బోథ్ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్‌లో ‘సేవ్ కాంగ్రెస్ ఫ్రం ఆర్ఎస్ఎస్’ పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంది శ్రీనివాస్‌రెడ్డికి అమ్ముకున్నదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చనిపోతే ఆర్ఎస్ఎస్ కండువా కప్పాలని సూచించిన వ్యక్తికి టికెట్ ఇస్తే ముస్లింలు ఓట్లు ఎలా వేస్తారని పేర్కొన్నారు. పార్టీని ప్రజల నుంచి దూరం చేయడానికే కాంగ్రెస్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని కార్యకర్తలు నిప్పులు చెరిగారు.
ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకులను కాదని ఇతరులకు సీట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఆదిలాబాద్ టికెట్‌ను అధిష్టానం అమ్ముకుంటే ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి కొన్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి కోసం పనిచేసేది లేదని నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అల్లుడు సంజీవరెడ్డిని ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రెబల్‌గా బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. టికెట్ ఆశించిన నాయకులు ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండాను మోస్తున్నామని, కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉన్న వారిని కాదని అధిష్టానం కేవలం డబ్బులున్న వారికి టికెట్ ఇచ్చిందని నిరసన వ్యక్తం చేశారు.
బోథ్ టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళనబాట పట్టారు. పార్టీ సీనియర్లు నరేశ్ జాదవ్, ఆడే గజేందర్ ఆధ్వర్యంలో ఇచ్చోడలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పార్టీ కోసం దశాబ్దాలుగా సేవ చేస్తున్న వారిని కాదని కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావు సూచించిన వన్నెల అశోక్‌కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బోథ్ అభ్యర్థి విషయంలో అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేనిపక్షంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని నాయకులు సూచించారు.
కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంది శ్రీనివాస్‌రెడ్డి కోసం పనిచేసే ప్రసక్తి లేదు. అవసరమైతే రాజీనామా చేస్తా. అధిష్టానం నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నా. ఓడిపోయే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చారు? కంది శ్రీనివాస్‌రెడ్డి కార్యకర్తలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. జిల్లా నాయకులను అల్లిగాడు, మల్లిగాడు అని సంబోధించే వ్యక్తిని ఎలా మద్దతు ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా ఉంటూ పార్టీ టికెట్ కోసం బీజేపీలో చేరిన వ్యక్తి, అక్కడ టికెట్ రాదని తెలుసుకుని కాంగ్రెస్‌లో చేరాడు.
డబ్బులు పోసి టికెట్ కొనుకున్నాడు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నాతోపాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవరెడ్డిని కాదని డబ్బులున్న కంది శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నాయకులు టికెట్‌ను అమ్ముకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని ప్యారాచూట్ నాయకులైన మథోల్ నుంచి నారాయణరావు పటేల్, ఆసిఫాబాద్ నుంచి శ్యాంనాయక్‌కు అధిష్టానం టికెట్ ఇచ్చింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టికెట్ల పంపిణీ విషయంలో తప్పులు చేశాడు. డబ్బులతో టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి గెలిస్తే వచ్చే సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకుంటాడు. సామాన్య కార్యకర్తలు నష్టం కలిగే ప్రమాదమున్నది. కంది శ్రీనివాస్‌రెడ్డి డబ్బులున్నాయనే అహంకారంతో పార్టీ సీనియర్లు, కార్యకర్తలను పట్టించుకోడు.
– సాజిద్‌ఖాన్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు
ఆదిలాబాద్ నియోజకవర్గ విషయంలో కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. టికెట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం డబ్బులుంటేనే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి సృష్టించింది. రాజకీయాల్లో ఉండాలంటే కేవలం డబ్బులుంటేనే సరిపోతుందా? డబ్బులున్నోళ్లకే సీట్ల కేటాయింపు జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్థానికంగా ముఖం చాటేసి, ఢిల్లీకి పోయి సీట్ల పంపిణీ చేపట్టారు. 2018లో ఆదిలాబాద్ నుంచి టికెట్ ఇచ్చినప్పుడు డబ్బులు కనపడలేదా..?
– గండ్రత్ సుజాత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
ఆదిలాబాద్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం సీనియర్‌ను కాకుండా వేరే వ్యక్తికి కేటాయించింది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వవద్దని సూచించాం. ఈ రోజు జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్రెడ్డిలో ఒకరిని పోటీలో నిలబెట్టాలని కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు.
– షేక్ ముబాకర్, కాంగ్రెస్ నాయకుడు, ఆదిలాబాద్