Illigal Toll Tax | కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట, జయశంకర్-భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపెల్లి గ్రామాల పరిధిలో గల మానేరు వాగుపై యధేచ్చగా దారి దోపిడీ కొనసాగుతోంది. ఈ వాగు మీదుగా వెళ్లే రోడ్డుపై స్థానికులు కొందరు టోల్ ట్యాక్సీ వసూలు చేస్తున్నారు. ఈ విషయమై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వినిపిస్తున్నాయి. ‘మానేరు వాగుపై మరో దారి దోపిడి’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ఓ వార్తా కథనం ప్రచురితమైంది.
సోమవారం ఉదయం 11 గంటల వరకూ అక్రమ టోల్‌టాక్స్ వసూలు చేస్తున్న నిర్వాహకులు కనిపించలేదు. వార్తాకథనం ప్రచురితం కావడంతో అధికారులెవరైనా వస్తారేమోనని అక్రమార్కులు రాలేదు. కానీ టోల్ టాక్సీ వసూలు చేస్తున్న నిర్వాహకులు లేకపోవడంతో వాహన చోదకులు సంతోషంగా ఏ టాక్స్ చెల్లించకుండానే వెళ్లారు. కానీ, 12 గంటల నుంచి అక్రమార్కులు బరితెగించారు. యధావిధిగా టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాలకు అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం వల్లే ఈ తతంగం నడుస్తున్నదని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.