kalvasrirampoor | కాల్వశ్రీరాంపూ ర్, ఏప్రిల్ 7 : పల్లెలలన్నీ పచ్చగా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రహదారులు, ప్రధాన సముదాయల వద్ద చెట్లు నాటించారు. పల్లెలన్నీ పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చేపట్టిన ఈ పథకంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మంగపేట నుండి పెద్దపల్లికి వెళ్లే రహదారుల వెంట ఉన్న రోడ్ల వైపు ఉన్న చెట్లన్నీ విద్యుత్ తీగలకు తగులుతున్నాయనే సాకుతో విద్యుత్ అధికారులు నరికివేస్తున్నారు. ఇప్పటి వరకు పచ్చగా, చల్లగా ఉన్న రోడ్లన్నీ బోసిపోతున్నాయి. రహదారుల వెంట వచ్చే బాటసారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సంబంధిత అధికారులు చూస్తూ పట్టించుకోవడంలేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై లైన్ ఇన్స్పెక్టర్ దస్తగిరిని వివరణ కోరగా ప్రధాన రహదారి వెంట ఉన్న విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగులుతుండడం వల్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు చెప్పారు.