Illegal construction | కోల్ సిటీ , మే 17: రామగుండం నగర పాలక సంస్థ 44వ డివిజన్ పరిధి రమేష్ నగర్ సమీపంలో కాలువ ఆక్రమణకు గురవుతుంది. ఈ విషయమై ఆ డివిజన్ ప్రజలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీకి ఫిర్యాదు చేశారు. రమేష్ నగర్ లోని ఇంటి నం. 15-2-331 యజమాని గడ్డం జయశంకర్ అనే వ్యక్తి కాలుపన ఆక్రమించి నూతన ప్రహరీ నిర్మాణం చేపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
కాలువ నీరు దిగువకు వెళ్లకుండా అడ్డుగా ఫిల్లర్ నిర్మాణం చేపట్టడంవల్ల భవిష్యత్లో అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని అడిగితే తమపైనే దబాయిస్తున్నారని వాపోయారు. ఈ విషయంలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పైగా రోడ్డుకు అడ్డుగా ర్యాంపు నిర్మాణం కూడా చేపట్టారని తెలిపారు.. ఫిర్యాదు చేసి పక్షం రోజులు గడిచినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణంపై తగు చర్యలు తీసుకోవాలని బస్తీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈవిషయమై టౌన్ ప్లానింగ్ ఏసీపీని వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉండగా రమేష్ నగర్, కళ్యాణ్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలలో ఇటీవల కాలంగా ఆక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.