కార్పొరేషన్, అక్టోబర్ 17: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశామని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని దుయ్యబట్టారు. గురువారం సాయంత్రం బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతిని కలిశారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టవద్దని కోరుతూ వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి నగరానికి రావాల్సినా సీఎం అస్యూరెన్స్ నిధులను మంజూరు చేయించడంతో పాటు మధ్యలోనే నిలిచిపోయిన అభివృద్ధి పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. అనంతరం గంగుల కమలాకర్ మాట్లాడారు.
తాము అధికారంలో ఉన్న పదేండ్లలో ఏనాడూ ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదన్నారు. కానీ, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయాలని తప్ప, ఇలా తప్పుడు కేసులు పెట్టేందుకు కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కరీంనగరంలో అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. తమ హయాంలో సీఎం అస్యూరెన్స్ కింద 350 కోట్ల నిధులు తెచ్చామని, ఇంకా 130 కోట్ల నిధులు రావాల్సి ఉందని, వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. ఈ నిధులు రాకపోవడంతో నగరంలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి మధ్యలోనే ఆగిపోయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం అస్యూరెన్స్ కింద కాంట్రాక్టర్ అనేక డివిజన్లలో రోడ్లను తవ్వి మధ్యలోనే వదిలేశారని, ఫలితంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణారావు, డిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, ఐలేందర్, జంగిలిసాగర్, తోట రాములు, బీఆర్ఎస్ నాయకులు గందె మహేశ్, తుల బాలయ్య పాల్గొన్నారు.