Singareni | గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, యువజన సేవల కమిషనర్, అకోయిజం సోనీ బాలా దేవి( ఐఎఫ్ఎస్) సోమవారం సింగరేణి రామగుండం ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులు, క్రీడా శిక్షకులు క్రీడా శాఖ అధికారులతో సమావేశమై గ్రామాలు, పట్టణాలు సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలపై యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు.
అనంతరం రామగుండంలోని సింగరేణి అతిథి గృహం (Guest House) ప్రాంగణాన్ని సందర్శించిన సోనీ బాలా దేవి పారిజాత (Parijatham) మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తన మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా సింగరేణి అటవీ విభాగం చేపడుతున్న హరితహారం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (అటవీ) భానోత్ కర్ణ, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన డిప్యూటీ డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, క్రీడా శాఖ అధికారులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సోనీ బాలా దేవి తెలిపారు.