Blacklisted | కోల్ సిటీ, డిసెంబర్ 17: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇదివరకు ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని, అలాగే నగరంలో ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ (ఎఫ్ఏసీ) జే.అరుణ శ్రీ ఆదేశించారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అభివృద్ధి పనులు నాణ్యతతో వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన మానవ శక్తి, యంత్రాలు, వస్తువులు ముందుగానే అందుబాటులో ఉంచుకొని ప్రారంభించిన పని అంతరాయం లేకుండా కాంట్రాక్టర్లు కొనసాగించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ధి పని ప్రారంబించని, పూర్తి చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి తగిన కారణం లేకుండా జాప్యం జరిగినట్లు గుర్తిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు.
ఆక్రమణలు తొలిగించి రోడ్డు వెడల్పు పనులు నిరాటంకంగా కొనసాగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.