Putta Madhukar | మంథని, ఆగస్టు 18 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దోపిడికి వత్తాసు పలికే మంత్రులకు చిత్తశుద్ది.. చీము..నెత్తురు..ఉంటే పథకాలను కొల్లగొడుతున్న ముఖ్య మంత్రిని కుర్చీ దించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కల్యాణ లక్ష్మి పై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా మంగళవారం మంథనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక రాజగృహా నుంచి అంబేద్కర్ రస్తా వరకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ర్యాలీగా అంబేద్కర్ రస్తాను చేరుకున్నారు. 420 హామీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన ప్లేకార్డులను ప్రదర్శిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మహిళలు బతుకమ్మ ఆడుతూ వినూత్న నిరసనకు తెరలేపారు. కార్యక్రమం ఆనంతరం బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి పుట్ట శైలజ వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. 130 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీకి చేతులకు మట్టి అంటకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేయాలని చూస్తుందో అర్థం అవుతుందన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచించే విధంగా కొత్త పాలనకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం, పాలనలో దాడులు, కేసులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధికి ఈ రాష్ట్రం నోచుకోవడం లేదన్నారు. మంథని నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గెలిచి 40ఏండ్లుగా ప్రజలను వంచిస్తున్న మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే 420 హామీలతో యావత్ రాష్ట్రాన్నే మోసం చేస్తున్నారన్నారు. ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఉన్న పథకాన్ని కూడ ఎగరగొట్టే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గర పడుతున్నా రాష్ర్టంలో ఒక్క పథకం కొత్తవి అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఊడగొట్టడానికి కోర్టులో కేసులు వేయిస్తున్నారన్నారు. కేసులకు కౌంటర్లు కూడా వేయడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో మాత్రం కోట్లు పెట్టి వకీళ్లను పెట్టుకునే ముఖ్యమంత్రి ప్రజలకు సంబంధించిన పథకాలను అమలు చేయవద్దని చెప్పితే దానికి మాత్రం వకీళ్లను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. వాళ్లే కేసులు వేయిస్తు పథకాలు రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని పుట్ట మధూకర్ ఆరోపించారు.
అభివృద్ది అంటే కాంగ్రెస్ ది దోచుకోవడం దాచుకోవడమేనన్నారు. ముఖ్యమం త్రి దోపకంలో మంత్రి వర్గం ప్రముఖ పాత్ర పోషిస్తుందని, పథకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి వద్ద పైసలు లేవు కానీ జూబ్లీహిల్స్‌లో రూ.200కోట్లతో ప్యాలెస్ , ఫోర్ట్ సిటీ పేరు మీద రూ.200కోట్లతో భవనం కడుతున్నాడన్నారు. మనమడు పుట్ బాల్ ఆడటానికి రూ.20కోట్లుతో గ్రౌండ్, మరో రూ.20కోట్లతో స్మిమ్మింగ్ పూల్ కట్టిస్తున్నాడన్నారు. వీటన్నిటిపై మంత్రులు ఎందుకు నోరు మెదుపడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 420 హమీలు రాసి ప్రజలను మోసం చేసిన మంత్రిగా ఉన్న మంథని ఎమ్మెల్యే పథకాలపై ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఈ పథకాలు అనుభవించే వారిలో 95 శాతం వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలే ఉన్నారని, బీసీ బిడ్డగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎస్సీ మంత్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ప్రతిపక్షాల గొంతు క్కాలని, వారిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తాడన్నారు. కమీషన్ల కోసమే మంథనిలో కూల్చి వేయడం పనులు చేస్తున్నారన్నారు. పేదలకు పథకాలు అమలు చేస్తే ఏమీ రావనే ఉద్ధేశ్యంతో కమీషన్ల కోసం అభివృద్ధి పనుల పేరిట నిధులు తెస్తున్నారన్నారు. మంత్రి నిధులు తీసుకువస్తే ఆయన తమ్ముడు కమీషన్లను సంచుల్లో వేసుకొని వెళ్తున్నాడని ఏద్దేవా చేశారు.
ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, ఊకదంపుడు కేసులకు భయపడేది లేదని, కేసులు పెట్టించడం ఆపి పథకాలు అమలు చేయాలని ఆయన హితవు పలికారు. ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి పేగు బంధమని, అందుకే ఆనాడు కేసీఆర్ కళ్యాణలక్ష్మి, దళితబంధు లాంటి పథకాలను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జక్కు రాకేష్, ఎగోలపు శంకర్‌గౌడ్, పూదరి సత్యనారాయణగౌడ్, జోడు శ్రీనివాస్, కనవేన శ్రీనివాస్, తాటికొండ శంకరయ్య, గుజ్జుల రాజిరెడ్డి, మాచీడి రాజుగౌడ్, ఎస్కే. యాకుబ్, శ్రీపతి బాపు, గీతాభాయి, మబ్బు ఓదెమ్మ, కొమురయ్య, ఆరెపల్లి కుమార్, తొంబూరపు తిరుపతి, పిల్లి సత్తన్న, పుప్పాల తిరుపతిలతో పాటు పలువురు కార్యకర్తలు, సర్పంచ్‌లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవమే కల్యాణ లక్ష్మి : జక్కు శ్రీహర్షిణీ, భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్

పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు నిలువెత్తు నిదర్శనంగా కల్యాణలక్ష్మి పథకమని భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మ్యానిఫెస్టోలో ఈ పథకం లేదని ఆమె వివరించారు. కేసీఆర్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఓ లంబాడి తండాకు వెళ్లిన సమయంలో అక్కడ ఓ తండ్రి తన బిడ్డ పెండ్లి కోసం దాచిన డబ్బులు అగ్నికి ఆహుతి అయ్యాయని, ఆ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆడబిడ్డ పెండ్లికి ఏ తల్లిదండ్రులకు బాధ పడకూడదని గొప్పగా ఆలోచన చేసి కల్యాణలక్ష్మి పథకం తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం ద్వారా రూ.51 వేలతో ఆర్థిక సాయం మొదలై రూ.1లక్షకు పెంచారని గుర్తు చేశారు. 10ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డ పెండ్లిన అయిన వెంటనే కల్యాణ లక్ష్మి చెక్కులు వచ్చేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్కులు మంజూరీ చేయడంలో జాప్యం చేస్తున్నారని, ఇటీవల రామగుండం నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఓ ఆడబిడ్డ బిడ్డను ఎత్తుకుని వచ్చి చెక్కు తీసుకెళ్లిందన్నారు. ఎన్నికల సమయంలో మానీఫెస్టో రాసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పాడని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తులం బంగారం ఎగ్గొట్టి ఈనాడు లక్ష ఎగ్గొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి పథకంపై కోర్టులో స్టే ఇచ్చే వరకు కౌంటర్ దాఖలు చేయక పోవడం ప్రభుత్వం తీరుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ వాళ్ల దొంగ పనులకు లాయర్లు ఉంటరు కానీ ప్రజల పథకాలను కొనసాగించేందుకు కేసులకు కౌంటర్ దాఖలు చేయడానికి లాయర్లు ఉండరని ఆమె విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ నిధులు విడుదల చేసే వరకు మహిళా లోకం పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
పథకాలు రద్దు చేసే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి : పుట్ట శైలజ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, మంథని.
ఆనాడు పేద ప్రజల సంక్షేమం కోసం గొప్పగా ఆలోచన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేశారని, అలాంటి గొప్ప పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని మంథని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ డిమాండ్ చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి కలలను చెరిపేస్తుందన్నారు. కల్యాణలక్ష్మిలాంటి గొప్ప పథకాన్ని లేదని, నెమ్మదిగా రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కల్యాణ లక్ష్మి పథకంపై చేసే పోరాటంలో ప్రతీ పేదింటి బిడ్డ భాగస్వాములై మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదింటి ఆడ బిడ్డల కోసం మాతాశిశు ఆసుపత్రి కట్టిస్తే కనీసం వైద్యులను నియమించలేదని, తాము ఆందోళన చేసే వరకు మంథని ఎమ్మెల్యేకు సోయి రాలేదని ఆమె ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి పథకం కొనసాగించే బాధ్యత 420 హమీలు రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళల బతుకమ్మ ఆట..
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దుకై చేస్తున్న కుట్రకు నిరసన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నేతృత్వంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన కార్యక్రమంలో బతుకమ్మ ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం స్థానిక రాజగృహ నుంచి ప్లే కార్డులను ప్రదర్శిస్తూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా అంబేద్కర్రస్తాకు చేరుకున్నారు. నిరసన కార్యక్రమంలో పుట్ట శైలజ, బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు వినూత్నంగా బతుకమ్మ ఆటను ఆడారు.
గోవిందా హరి.. గోవిందా.. రైతు బంధు గోవిందా.. గోవిందా హరి.. గోవిందా.. రైతు బీమా గోవిందా,
గోవిందా హరి.. గోవిందా.. యూరియా బస్తాలు గోవిందా.. గోవిందా హరి.. గోవిందా.. షాదీముబార్ గోవిందా, గోవిందా హరి.. గోవిందా.. కల్యాణ లక్ష్మి గోవిందా, గోవిందా హరి.. గోవిందా.. తులం బంగారం గోవిందా, గోవిందా హరి.. గోవిందా.. ఆడబిడ్డలకు రూ. 2500లు గోవిందా, గోవిందా హరి.. గోవిందా .. వృద్ధుల పెన్షన్ గోవిందా.. గోవిందా హరి.. గోవిందా.. కాంగ్రెస్ ప్రభుత్వం గోవిందా, గోవిందా హరి.. గోవిందా రేవంత్‌రెడ్డి గోవిందా.. అంటూ ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా ప్రజలను చేస్తున్న తీరుపై పాట పాడుతూ ఆటలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు.