కార్పొరేషన్, జూన్ 16: కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు అధ్యక్షతన స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే పండుగ దశాబ్ది ఉత్సవాలని పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపాలిటీ తనకు రాజకీయంగా తొలి మెట్టుగా ఎదిగానన్నారు. తాను ఏ స్థాయికి చేరినా ఈ మున్సిపాలిటీని మరిచిపోయేది లేదన్నారు. సమైక్య పాలనలో మున్సిపాలిటీల్లో మట్టి రోడ్డు వేసేందుకు నిధులు అడిగే పరిస్థితి ఉండేదన్నారు. సీసీ రోడ్లు, మురికికాల్వల నిర్మాణానికి నిధుల కొరత ఉండేదని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే పరిస్థితి ఉండేది కాదని గుర్తుచేశారు.
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వేగంగా నగ రం అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ ప్ర త్యేక అభిమానంతో వందల కోట్ల నిధులను ఇచ్చారని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ కూడా గుంత లు లేని రోడ్లను వేశామన్నారు. కార్పొరేటర్లు, నగ రం గౌరవం పెరిగేలా నిధులు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. నగరంలో రూ. 350 కోట్లను సీఎం ఆక్యూరెన్స్ కింద కేసీఆర్ మంజూరు చేయడంతో అన్ని డివిజన్లల్లో పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయన్నారు. కేంద్రం స్మార్ట్‌సిటీలను చేపట్టినప్పుడు హైదరాబాద్‌కు వద్ద ని సీఎం కేసీఆర్ కరీంనగర్‌ను ఎంచుకున్నారని గుర్తు చేశారు. గతంలో మానేరు నది దుర్గంధంతో నిండి ఉండేదని, కాని ఇప్పుడు ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఇక్కడ కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తి కాగా, మానేరు రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.
తెలంగాణ రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అ య్యేదా? అక్కడి నుంచి ఎల్ఎండీలోకి వచ్చేవా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ సంపాదన ఇప్పు డు ప్రతి పల్లెకు చేరుతుందతన్నారు. ఉద్యమకారుడే పాలకుడు కావడం వల్లే రాష్ట్రంలో అన్ని వ ర్గాలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందాలని, నమ్మకంతో అధికారం అప్పగించిన ప్రజల నమ్మకం వమ్ము కాకుండా పని చేస్తున్నామని తెలిపారు. తోమ్మిదేళ్లలోనే నగరం జిగేల్మనే విధంగా తీర్చిదిద్దామన్నారు. కాని మళ్లీ దుష్టశక్తులు తెలంగాణపై విషం చిమ్మేందుకు వస్తున్నాయని విమర్శించారు. గతంలో చేసిన ఒక్క తప్పిదంతో 60 ఏళ్లు ఈ ప్రాంతం గుడ్డి దీపంగా మారి వెనకబాటుతనానికి గురైందన్నారు. మళ్లీ ఇప్పడు ఆ తప్పు చేయవద్దని, వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. భవిష్యత్తు మరింత మంచిగా ఉండాలంటే సీఎం కేసీఆర్ పాలకులుగా ఉండాలన్నారు. నగరాభివృద్ధి కోసం అన్ని విధాలా కృషిచేస్తామన్నారు.
బల్దియా వాహనాల ర్యాలీ, మానవహారం, ఉద్యోగుల ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి వేడుకలను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఉదయం మహిళలకు రంగోలీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం విద్యార్థులతో మానవహారం చేపట్టారు. అంబేద్కర్ స్టేడియం నుంచి నగరపాలక సంస్థలో వివిధ సేవలు అందిస్తున్న అన్ని విభాగాల వాహనాల ర్యాలీకి మంత్రి గంగుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ అంబేద్కర్ స్టేడియం నుంచి కలెక్టరేట్, తెలంగాణ చౌక్, కోర్టు చౌరస్తా మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీకి తెలంగాణ చౌక్ వద్ద ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి కార్యాలయం నుంచి పద్మనాయక కల్యాణ మండపం వరకు ర్యాలీ చేపట్టారు.
ప్రశంసాపత్రాల పంపిణీ
వేడుకల సందర్భంగా నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో మెరుగైన పనితీరు చూపించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను మంత్రి గంగుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ చేతుల మీదుగా అందించారు. పారిశుద్ధ్య విభాగంలో 12 మంది కార్మికులకు, కంపోస్టు యూనిట్‌ను నడిపిస్తున్న శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు, నీటి నిర్వహణ విభాగంలో 2, రెవెన్యూ, కార్యాలయ సిబ్బందితో పాటుగా ఇతరులకు ప్రశంసాపత్రాలు అందించారు. వీధివ్యాపారులకు పీఎం స్వనిధి కింద 6214 మందికి రూ.12.42 కోట్ల చెక్కును అందించారు. ఈ కా ర్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణారావు, నగర కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్లు, అధికారులు, సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిపై ప్రజల్లో చర్చ పెట్టాలి
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రతి కార్పొరేటర్ ప్రతి ఇంటిలోనూ చర్చ పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలపై జరిగింది. స్వరాష్ట్రంలో రాష్ట్ర నిధులు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి, సంక్షేమ పథకాలు తదితర వాటిపై ప్రజల్లో చర్చ పెట్టి వారికి వివరించాలి. దీనిని స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలి. సమైక్యపాలనలో తెలంగాణకు సంబంధించి నిధులన్నీ ఆంధ్ర పాంత్రాలకు తరలించుకొనిపోయారు. అప్పటి తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలందరూ వారి చెప్పుచేతల్లోనే ఉండి వారి చెప్పిన వాటికి తలలు ఊపేవారు. ఉద్యమంలో తెలంగాణలో ఆదాయం ఉందంటే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు అదే ఆదాయంతో రాష్ట్రం ఎంతగా అభివృద్ధి సాగుతుందో చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కరీంనగర్‌కే వచ్చారు.
అభివృద్ధి కోసం మొదటి జీవోతో వందల కోట్ల నిధులు ఇచ్చి నగర అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కరీంనగర్‌ను లండన్‌గా మార్చుతామని చెప్పితే. .. కొందరు రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడు అవుతుందంటూ పిచ్చికూతలు కూశారు. అలాంటి వారికి ఇప్పుడు నగరంలో సాగుతున్న అభివృద్ధే సమాధానం చెబుతంది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా చేసుకుంటూనే వచ్చే దశాబ్దికి చేయాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ తీసుకువచ్చే ప్రయత్నం ఎంపీగా ఉన్నప్పుడు చేశాం. కానీ కర్ణాటకకు తరలిపోతుంటే ఇప్పటి నాయకులు ఏం చేయలేకపోయారు. కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల అడిగితే మేం నాలుగు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశాం. ఇది చిత్తశుద్ధికి నిదర్శనం. కరీంనగర్లో ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. వాటిని పూర్తి చేసి నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం.
– వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి
గతంలో ఎప్పుడూ లేని విధంగా కరీంనగర్లో అభివృద్ధి చెందుతున్నది. ఈ అభివృద్ధి మరింత కొనసాగాలంటే సీఎం కేసీఆర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. నగరాభివృద్ధికి మంత్రి గంగుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఎంతో సహకారం అందిస్తున్నారు. నగరానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే వందల కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులతో నగరానికి ప్రపంచ స్థాయిలో శోభ వస్తుంది.
– మేయర్ యాదగిరి సునీల్‌రావు