కార్పొరేషన్, సెప్టెంబర్ 14 : కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి తెలంగాణ పగ్గాలు వారికి అప్పగిస్తే రాష్ట్రం ఢిల్లీ పాలకుల చేతుల్లోకి వెళ్తుందని, అలా జరిగితే ఏడాదిలోనే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పదేళ్ల కాలంలో రాష్ట్ర సంపద పెరిగిందని, దీనిపై కన్నేసిన ఆంధ్రా నాయకులు దోచుకపోయేందుకు కాంగ్రెస్, బీజేపీ ముసుగులో మరోసారి వస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గురువారం రాత్రి కరీంనగర్‌లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన నియోజకవర్గానికి చెందిన పుట్టపాక శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్లో చేరాలన్నారు. ఈ పార్టీ మాత్రమే తెలంగాణ పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైతే ఇక్కడ కరెంటు ఉండదని, నష్టపోతారని చెప్పిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ ముసుగులో హైదరాబాద్‌లో అడ్డా వేశారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటైతే పాస్‌పోర్టు తీసుకొని పోవాల్సి వస్తుందన్న షర్మిల, రాంచంద్రరావు ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో ఇక్కడకి వస్తున్నారని దుయ్యబట్టారు. పక్కనే గోదావరి నీరు ఉన్నా ఇక్కడ పారలేదని, ఆంధ్రాకు తరలించారని, పక్కనే బొగ్గు, సింగరేణి ఉన్నా ఇక్కడ కరెంటు వచ్చేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జలాలు పారిస్తున్నారని తెలిపారు.
దీంతో దేశంలోనే మొదటిస్థానంలో ఉండేలా పంటలు పడుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందన్నారు. ఎన్నో ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలన్నీ హైదరాబాద్‌కు వస్తున్నాయని, దీంతో సంపద పెరిగిందన్నారు. దీనిపై కన్నేసిన ఆంధ్రా నాయకులు వీటిని దోచుకపోయేందుకు వస్తున్నారని విమర్శించారు. వీరిని నమ్మితే తెలంగాణ భవిష్యత్తు అంధకారం కావడం ఖాయమన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేమని, కేసీఆర్‌ను కాదంటే ఢిల్లీ గద్దలు దిగుతాయని దుయ్యబట్టారు. ఈ ఐదు నెలలు కేసీఆర్ కోసం మనం పని చేస్తే వచ్చే ఐదేండ్లు కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పని చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ, ఎంపీపీ లక్ష్మయ్య, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సిద్ధాంతం అభివృద్ధి మాత్రమే
భారత దేశ సంస్కృతి కోసం ఆలోచన చేసే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. యాదాద్రి అభివృద్ధి ఒక్కటే సంస్కృతి కోసం ఆయన చేస్తున్న ఆలోచనకు నిదర్శనం. తెలంగాణలో ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు. అయినా ఆయన ఎలాంటి ప్రచారం చేసుకోలేదు. కానీ, కొందరు నాయకులు ఒక్క దేవాలయాన్ని కట్టి ఎంతో ప్రచారం చేసుకుంటున్నారు. సంస్కృతి పేరిట రెచ్చగొట్టడమే తప్ప వారు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ సిద్ధాంతం కేవలం అభివృద్ధి మాత్రమే. బీఆర్ఎస్లో చేరిన యువకులపై విమర్శలు చేస్తున్న బండి సంజయ్ మరి ఇన్నాళ్లూ తన వద్ద ఉన్నప్పుడు డబ్బుల కోసమే పని చేశారో చెప్పాలి. ఇప్పుడున్న యువత కూడా బీజేపీలో డబ్బుల కోసమే చేస్తున్నారా? ఇప్పటికైనా బండిసంజయ్ తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. గతంలో ఉమ్మడి కరీంనగర్‌కు మెడికల్ కళాశాల తీసుకురావాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పు డు ఉమ్మడి జిల్లాకు నాలుగు మెడికల్ కళాశాలలు తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్దే.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
ఎక్కడా లేని సంక్షేమ పథకాలు
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వీటికి ఆకర్షితులైన యువత పార్టీలోకి రావడం సంతోషకరం. కాళేశ్వర జలాలతో సాగునీరు అందిస్తుండడంతో దేశంలో అత్యధికంగా పంట పడిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటుతోపాటు, రైతుబంధు, బీమా వంటి పథకాలను కూడా అమలు చేస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. పేదలు, బడుగుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పని చేస్తుంది.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
ప్రజల సంతోషమే ధ్యేయం
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండడమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నది. మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కేవలం అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నారు. వీరి ఆలోచనతో పదేళ్ల కాలంలో కరీంనగర్ ఎంతగా మార్పు చెందిందో ప్రజల కళ్లకు కనిపిస్తున్నది. ఇలాంటి నాయకులను మరింతగా బలోపేతం చేస్తే నగరం రాష్ట్రంలోనే గొప్ప నగరంగా మారుతుంది. పార్టీలోకి యువకులు చేరుతుంటే బండి సంజయ్ డబ్బుల కోసం పోతున్నారని వాఖ్యలు చేస్తున్నారు. మరి ఇన్నాళ్లూ ఆయన దగ్గర డబ్బుల కోసమే పని చేశారా? చెప్పాలి. గెలుపోటములతో సంబంధం లేకుండా అనునిత్యం ప్రజల మధ్య ఉండే గంగుల, వినోద్‌కుమార్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.
– యాదగిరి సునీల్‌రావు, నగర మేయర్
కార్యకర్తలకు బీఆర్ఎస్లో పెద్దపీట
క్రమశిక్షణతో పని చేసే కార్యకర్తలకు పదువులు ఇచ్చే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. నాలాంటి చిన్న కార్యకర్తకు కూడా జిల్లా పదవి ఇచ్చిన ఘనత పార్టీకే దక్కుతుంది. ఎల్లప్పుడూ పార్టీలోని కార్యకర్తలకు అండగా నిలుస్తుంది. పేదలు, బడుగుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలతో అధికారంలో రావాలని చూస్తున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్, వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోడానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలి.
– పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్