రెండేళ్లుగా పాలకవర్గాలు లేక పల్లెలు మురికి కూపాలుగా మారాయి. పదవీ కాలం ముగిసి ఇరవై నెలలైనా పంచాయతీలకు ఎన్నికలు లేక గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయి. పాలకవర్గాలు లేక అధికారులు పట్టించుకోక ఊర్ల పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి కనిపిస్తున్నది. పారిశుధ్యలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పటి చెత్త అప్పుడే ఎత్తి ఊరి బయట డంప్ యార్డుకు తరలించే లక్ష్యం ఉండగా, ప్రస్తుతం ఆ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఏ వీధిలో జమయ్యే చెత్తా చెదారాన్ని అదే వీధిలోని ఓ మూలన పడేస్తున్న దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుండగా.. దారుల వెంట ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది.
.. పై చిత్రంలో కనిపిస్తున్నది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామ పంచాయతీకి సబంధించినది. గ్రామంలో ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా చెత్తా చెదారం పేరుకుపోయింది. ఎక్కడ చూసినా చెత్త ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మురుగు కాలువల్లో చెత్త పూర్తిగా పేరుకుపోవడంతో గ్రామంలో ఎక్కడ చూసినా కంపు కొడుతున్నది.
మురుగు కాలువే లేదు
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లోని ప్రధాన దారికి ఆనుకుని మురుగుకాలువ కూడా లేకపోవడంతో కచ్చడ్రైన్ కొట్టి మురుగు నీటిని తరలిస్తున్నారు. దీనిని కూడా నిర్వహించకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే ఆగుతున్నది. తలుపు తెరిస్తే కంపు వాసన వస్తున్నదని ఈ కాలువ వెంట ఉన్న నివాస గృహాల ప్రజలు వాపోతున్నారు. రెండేళ్లుగా నిధులు లేక పోవడంతో ఈ మురుగు కాలువ నిర్మాణానికి నోచుకోలేదు.
కరీంనగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా వాటిని పట్టించుకునే వారు లేకుండా పోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు కంపు కొడుతున్నాయి. రెండేళ్లుగా ఎన్నికలు లేక కేంద్రం నుంచి ఆగిపోయిన నిధులను రాబట్టుకునే ఉద్దేశంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు తప్ప, అభివృద్ధి కోసం కాదనే చర్చ గ్రామాల్లో జరుగుతున్నది. కాగా, రెండేళ్ల క్రితం వరకు గ్రామాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయనే చర్చ కూడా గ్రామాల్లో జోరందుకున్నది. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి అనేక అభివృద్ధి పనులు చేసింది.
ఈ పనులను కొనసాగించక పోవడంతో ఇప్పుడు ఆ లక్ష్యం, ఉద్దేశం పూర్తిగా నిర్వీర్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రెండేళ్లలో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. పంచాయతీ పాలకవర్గాల గడువు తీరిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన తెచ్చారు. ఈ అధికారులు ఎక్కడ కూడా తమ బాధ్యతలను నిర్వహించింది లేదు. పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో చాలా మంది పంచాయతీ కార్మికులు అప్పులు చేసి పంచాయతీల పనులు నిర్వహించే పరిస్థితి వచ్చింది.

కంపు కొడుతున్న గ్రామాలు
రెండేళ్లుగా నిధులు రాక గ్రామాల ఖజానా ఖాళీ అయ్యింది. అభివృద్ధి పనులు పక్కనపెడితే కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితులు కరువయ్యాయి. గ్రామాల్లో పారిశుధ్య లోపం ఏర్పడి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతిరోజూ వచ్చే వ్యర్థాలు కూడా డంప్ యార్డుకు తరలించే పరిస్థితి లేదు. ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తున్నది. వానకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై చెత్తా చెదారం తొలగించక పోవడం, వీధుల్లోనే వ్యర్థాలు పడేయడం, రోజుల తరబడి వాటిని డంప్ యార్డులకు తరలించకపోవడంతో ప్రజలు రోగాల పాలయ్యారు. మురుగు కాలువలు కూడా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కాలువల నుంచి తీసిన పూడిక మట్టి ఎక్కడబడితే అక్కడ కుప్పలుగా కనిపిస్తున్నది. రెండేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా నోచుకోలేదు.
స్ఫూర్తిని రగిలించిన కేసీఆర్ పాలన
కేసీఆర్ తన పదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2018లో కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చి పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలను కట్టబెట్టారు. గ్రామ అవసరాలను తీర్చే ప్రతీ పనిని చట్టంలో తప్పనిసరి చేయడంతో గ్రామాల్లో ప్రగతి పరుగులు పెట్టింది. కేంద్రం వచ్చే నిధులకు రాష్ట్ర నిధులను జోడించి నెలనెలా విడుదల చేశారు. అంతే కాకుండా, ప్రతి ఏటా రెండుసార్లు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
పల్లెల అవసరాలు తీర్చేందుకు మౌలిక వసతులు కల్పించడమే కాకుండా నిధులు విడుదల చేయడంతో గ్రామాల సమస్యలు పరిష్కారమయ్యాయి. వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం పారిశుధ్య లోపమేనని గుర్తించి.. చెత్తను ఊరికి దూరంగా పడేసేందుకు డంప్ యార్డులు నిర్మించారు. వ్యర్థాలను తరలించేందుకు తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి డంప్ యార్డులకు తరలించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను సమకూర్చారు. ఇలా అనేక సంస్కరణలు తేవడంతో గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు దాదాపుగా లేకుండా పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తెచ్చిన సంస్కరణలను కొనసాగించ లేకపోయింది. కనీసం ఎన్నికలు కూడా నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తాయి..
గతమెంతో ఘన కీర్తి..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాలు ప్రగతిలో ఘనకీర్తిని సాధించాయి. జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లానే 2017లో ఆరుబయట మల మూత్ర రహిత జిల్లాగా, 2018లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2018లో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత దేశంలో మొదటి స్థానం సాధించింది. 2019లో స్వచ్ఛతా దర్పణ్‌లో స్వచ్ఛ్ సుందర్ శౌచాలయ్, 2019 ఆగస్టులో స్వీడన్లో నీటి నిర్వహణ పొదుపు వారోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం అందింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2019లో ప్రధాన మంత్రి చేతుల మీదుగా స్వచ్ఛ పురస్కారాలను అందుకున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో జిల్లాలోని ఆదివారంపేట, సుందిళ్ల, సుల్తాన్పూర్, గర్రెపల్లి గ్రామాలు సైతం జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నాయి. ఇలా స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచిన పల్లెలు నేడు కాంగ్రెస్ పాలనలో కళ తప్పి కళా విహీణంగా, మురికి కూపాలుగా తయారయ్యాయి.
ఇది బావి కాదు.. మురుగు నీటి గుంత
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ మురుగు నీటి గుంత కంపు కొడుతున్నది. నివాసాల పక్కనే ఉండడంతో నిత్యం దుర్వాసన వస్తున్నదని స్థానికులు వాపోతున్నారు. ఈ గుంతలో విపరీతమైన దోమలు తయారవుతున్నాయని, రాత్రయితే ఇండ్లలోకి చేరి ఇబ్బంది పెడుతున్నాయని చెబుతున్నారు.
ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే..
పాలకుర్తి మండల కేంద్రంలోని రోడ్డు ఇది. దీని పక్కనే డ్రైనేజీ ఉన్నా శుభ్రం చేసే వారు లేక నీరు రోడ్డుపైనే నిలిచింది. దీంతో రోడ్లు సైతం మురికి కూపాలుగా తయారయ్యాయి. రోడ్డుపై వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంపు కొడుతున్న డ్రైనేజీ
..కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని ఒక డ్రైనేజీ ఇది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల నుంచి వైకుంఠధామానికి వెళ్లే దారిలో ఉన్న మురికి గుంత కంపు కొడుతున్నది. ఈ వీధిలో నుంచి వచ్చే మురుగు నీరంతా ఇక్కడే చేరుతున్నది. అక్కడికి వెళ్లగానే కంపు వాసన వస్తున్నదని గ్రామస్తులు వాపోతున్నారు.
రెండేళ్లుగా పట్టించుకునే వారు లేరు
రెండేళ్ల నుంచి గ్రామాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. పారిశుధ్యం పూర్తిగా లోపించింది. దోమల వ్యాప్తి పెరిగి గ్రామీణ ప్రజలు డెంగీ వంటి రోగాల బారిన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు వచ్చే నిధులు నిలిచిపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. కనీసం పంచాయతీల అవసరాలు తీర్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో అధికారులు కూడా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
– సింగిరెడ్డి కృష్ణారెడ్డి, చొప్పదండి ఎంపీటీసీ సభ్యుల ఫోరం మాజీ అధ్యక్షుడు