కరీంనగర్లో 24 గంటల మంచినీటి సరఫరా చేయాలని తాను కార్పొరేటర్ కలగన్నానని, మంత్రిగా ఉన్నప్పుడు ఈ పనులకు సంబంధించి భూమిపూజ చేశానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా దానిని పూర్తి చేయడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. తాను ఎమ్మెల్యేగా అనుకున్న లక్ష్యం మేరకు 24 గంటల మంచినీటి సరఫరా అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు తాగునీటిలో కలుషిత నీరు వస్తుందన్నానని, అది రాకుండా ఉండాలంటే 24 గంటల మంచినీటి సరఫరా ఉండాలని అనుకున్నామన్నారు. దీనిపై కర్ణాటకలోని ధార్వాడ, నాగపూర్, బ్యాంకాంక్ వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు 24 గంటల పాటు మంచినీటిని సరఫరా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్, కేటీఆర్‌ని కలిసి ఈ విషయమై కోరానని తెలిపారు. దీనికి వారు అనుమతి ఇచ్చారని, ఇప్పుడు అది సాధ్యమైందన్నారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లో మొట్టమొదటగా 24 గంటల మంచినీటి సరఫరా ఇస్తున్న నగరంగా కరీంనగర్ నిలిచిందన్నారు. ఇది కరీంనగర్ ప్రజలకు గర్వకారణమన్నారు. మంచినీరు కలుషితం కాకుండా ఉండాలంటే 24 గంటలు ఆ పైపులైన్లలో నీరు ఉండాలని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావని తెలిపారు. 24 గంటల మంచినీటి సరఫరా తమ చేతుల మీదుగా మొదలుకావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలోని 4 వేలకు పైగా ఇళ్లకు పైలెట్ ప్రాజెక్టు కింద 24 గంటల సరఫరా చేపట్టామని, దీనిని నగరవ్యాప్తంగా విస్తరించేందుకు రూ.300 కోట్ల నిధులు అవసరం అవుతాయని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు విన్నవించారు. అభివృద్ధి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, దీని కోసం మంత్రులు కృషి చేయాలన్నారు. దక్షిణ భారత దేశంలో మొదటి కేబుల్ బ్రిడ్జి కరీంనగర్లో నిర్మించామని, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.