Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 1 : నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు వరాలు కురిపించి గెలిచాక ఆటో డ్రైవర్ల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఆటో ఆర్టీసీ పేరిట కొత్త రకం మోసానికి పాల్పడుతుందని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లను మభ్య పెట్టడం మానుకుని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం వెంటనే అమలు చేయాలి డిమాండ్ చేశారు.
గోదావరిఖని బస్టాండు అడ్డాలో ఏర్పాటుచేసిన ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటివరకు ఎందరో ముఖ్యమంత్రులను చూసాం కాని రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ని ఇంతవరకు చూడలేదని అన్నారు. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన ఆటో సంక్షేమ బోర్డు, రూ.12 వేల భృతి తదితర హామీలను మరిచి మళ్లీ కొత్తగా ఆటో డ్రైవర్లను మోసం చేయడానికి, ఫస్ట్ మైల్ టూ లాస్ట్ మైలు వరకు ఆర్టీసీ ఆటో, అనే కార్యక్రమాన్ని తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, ఆటో డ్రైవర్లకు సంబంధం లేని, ఆటో డ్రైవర్లను మోసం చేసే ఇలాంటి పథకాలను మేము సహించబోమని అన్నారు. రామగుండం కార్పొరేషన్ ఆటో జేఏసీ అధ్యక్షుడ ఎండి బురహన్ అధ్యక్షతన జురిగిన కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ ఎస్కే జబ్బర్, నాయకులు కాజీపేట రాజయ్య, పల్లెబాపు, రాజేశం, మడిపెద్ది రమేష్, షరీఫ్ తదితరులు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.