Dharmapuri | ధర్మపురి, అక్టోబర్ 13: ధర్మపురిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్వహణ సరిగాలేక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. రోడ్లు, వీదులు, డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు వృద్ధి చెంది ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్యంగా 13వ వార్డులో పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఈ వార్డులో ఎక్కడ చూసిన మురుగునీరే దర్శనమిస్తున్నది. మురుగుకాలువలు నిండి రోడ్లపై పొర్లడంతో జనాలు ఇబ్బంది పుడుతున్నారు.
రోడ్లు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. తాగునీరు కూడా కలుషితం అవుతున్నది. అంతేకాకుండా రోడ్లన్నీ మురుగునీటితో కంపుకంపుగా మారాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంల లేదని స్థానికులు మండిపడుతున్నారు. ధర్మపురిలో తడిపొడి చెత్త సేకరణ మినహా పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేశారనే ఆరోపణలున్నాయి.
మురుగునీరు రోడ్లమీద పారుతుండడంతో దోమలు వృద్ధిచెందడంతో పాటు తాగునీరు కలుషితం అవుతుండడంతో జ్వరాలు ప్రభలుతున్నాయి. జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనాల సంఖ్య రోజరోజుకీ పెరుగుతున్నది. ఈ క్రమంలో ఎవరి ఇళ్ల ముందు పేరుకుపోయిన చెత్త వారే తొలిగించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.