కోల్‌సిటీ, సెప్టెంబర్ 27: రామగుండం నగర పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు ఆపరేషన్ సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు నగర పాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు విస్తృత సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో మల్కాపూర్ పరిధిలో మల్లపురాణి కుంటలో చేపట్టిన దాదాపు 17 నిర్మాణాలు ఎఫ్టీఎల్లోకి వస్తాయని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు నివేదికలు సమర్పించగా, ఆయన స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం ఇన్చార్జి కమిషనర్ జే అరుణ శ్రీ సదరు నిర్మాణదారులకు నోటీసులు కూడా పంపించారు. అలాగే శుక్రవారం గోదావరిఖనిలోని తిలక్‌నగర్ ఏరియాలో కూడా ఇన్చార్జి కమిషనర్, నగర పాలక సిబ్బందితో కలిసి సర్వే పనులను పరిశీలించారు. రోడ్డు ఆక్రమిత నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా అలాంటి నిర్మాణాలు ఉన్నా వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా, జంక్షన్ అభివృద్ధిలో భాగంగా రోడ్డును ఆనుకొని ఉన్న 10 దుకాణాలను శుక్రవారం పూర్తిగా తొలగించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన రెండు ఫంక్షన్ హాళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు.
గోదావరిఖని మార్కండేయ కాలనీ, దుర్గానగర్, కళ్యాణ్‌నగర్, మేదరిబస్తీ, సప్తగిరి కాలనీ తదితర ఏరియాల్లో ప్రధాన నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఇన్చార్జి కమిషర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు రెండ్రోజులుగా సర్వే చేస్తున్నారు. వీటిలో అధిక శాతం మార్కండేయ కాలనీ, దుర్గానగర్, గౌతమినగర్, కల్యాణ్‌నగర్, సప్తగిరి కాలనీలో నాలాలపై నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. అలాగే ఇటీవల కూల్చివేసిన ఓల్డ్ అశోక్ థియేటర్ పక్కనే దాదాపు 20 సెల్‌ఫోన్ దుకాణాలను కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సర్వే ఆధారంగా రామగుండం కార్పొరేషన్లో బఫర్ జోన్, ఎఫ్టీల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నాం. వాటిని ఖాళీ చేయని పక్షంలో పైనుంచి ఆదేశాలు వచ్చిన పిదప కూల్చివేత చర్యలు చేపడుతాం. గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతం రెవెన్యూ రికార్డుల ప్రకారంగా చూస్తే బఫర్ జోన్లో లేదు. ఏమైనా ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇంకా నగరంలో రోడ్డు ఆక్రమిత నిర్మాణాలను కూడా తొలగిస్తాం.
– అరుణ శ్రీ, పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్