కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ హామీ ఏమైందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్లో ఎక్కడా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశం లేదని, మాట నిలబెట్టుకోలేక దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ పరువు పోతున్నదని మండిపడ్డారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ చరిత్రలో అత్యధిక ఉద్యోగాలను కేసీఆర్ హయాంలోనే ఇచ్చారని, ఒకవేళ ఇవ్వలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
అసెంబ్లీలో యువజన సర్వీసుల పద్దుపై కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. యూత్ డిక్లరేషన్‌లో ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు నింపుతామని, శాఖల వారీగా ఖాళీలను ప్రకటించి భర్తీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆ హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇస్తామన్న నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇవ్వకుండా ధోకా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ యువత తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. నాడు కరోనా లాక్డౌన్.. నేడు నోటిఫికేషన్ లాక్డౌన్ చూస్తున్నామని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి నాడు అశోక్‌నగర్ లైబ్రరీకి వెళ్లి చాయ్‌పే చర్చ పెట్టారని, నేడు అక్కడ 144 సెక్షన్ పెడుతున్నారని విమర్శించారు. సీఎం, ఆయన మనుమడు, అన్న పిల్లల ఆనందం కోట్లు వెచ్చించి ఫుట్‌బాల్ స్టార్ మెస్సీని తీసుకొచ్చే బదులు.. తెలంగాణలో ఉన్న మెరికల్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెటర్ సిరాజ్‌కు ఇచ్చినట్టుగానే తిలక్ వర్మ, గుత్త్తా జ్వాల, ప్రజ్ఞాన్ ఓజా, ద్రితికి కూడా నగదుసాయం, స్థలం, ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.