జమ్మికుంట/ హుజూరాబాద్‌రూరల్, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోతామని, మోసపోతే గోసపడతామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆ పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని, మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజలవైపున ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఉదయం జమ్మికుంట, సాయంత్రం కార్నర్ మీటింగ్‌లలో పాల్గొని మాట్లాడారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ ఎందుకు ఓటెయ్యాలో? చెప్పాలని ప్ర శ్నించారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఓటర్ల ముందుంచారు. అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇంటి ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కోరారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన ప్రజలతో ముచ్చటించారు. పాటలకు నృ త్యాలు చేశారు. ఆయా కార్నర్ సమావేశాల్లో ఎమ్మెల్యే సతీమణి శాలినీరెడ్డి, హుజూరాబాద్ ఎన్నికల ఇన్చార్జి పన్యాల భూపతి రెడ్డి, బీఅర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, మాజీ కౌనిలర్లు రమాదేవి, తిరుమల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.