జమ్మికుంట, సెప్టెంబర్23: ‘మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. షరుతుల్లేకుండా ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేయాలి. రైతుభరోసా ఎకరాకు 7,500ఇవ్వాలి. ఇప్పటివరకు ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చకుంటే సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను గ్రామాల్లో తిరగనియ్యం’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
సోమవారం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ, రైతుబంధు సమయానికి అందించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులను విస్మరించడం దుర్మార్గమన్నారు. బడ్జెట్లో రుణమాఫీకి 26వేల కోట్లు ప్రవేశపెట్టారని, మాఫీ చేసింది 17.9వేల కోట్లు మాత్రమేనని ఆరోపించారు. 49వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం, ఇప్పుడు 60శాతం కూడా మాఫీ చేయలేదన్నారు.
షరతుల్లేకుండా అందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు ప్రవేశపెట్టి.. 18వేల కుటుంబాలకు పథకాన్ని అమలు చేశారన్నారు. కాంగ్రెస్ సర్కారు రెండోవిడుతలో మరో 5వేల కుటుంబాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాతాల్లో ఉన్న నిధులు ఎందుకు రిలీజ్ చేయడం లేదో చెప్పాలన్నారు. దళిత కుటుంబాలపై స్వార్థ రాజకీయాలు చేయవద్దని హితవుపలికారు.
దళిత సోదరులతో త్వరలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనవసర స్టేట్మెంట్లు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు శ్రీనివాస్, సంపత్, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రావు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్, నవీన్, రాజ్‌కుమార్, సాదవరెడ్డి, భాస్కర్, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
దుష్ప్రచారాలను తిప్పికొడతాం
కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే దిక్సూచి. అలాంటి ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేకుండా సీఎం, మంత్రులు మాట్లాడుతున్నరు. రూ.లక్ష కోట్లు వృథా చేశారని, పైసలన్నీ గోదావరిలో పోశారని ఆరోపిస్తున్నరు. ప్రకృతి విపత్తుతో మేడిగడ్డకు చెందిన మూడు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నరు. కాళేశ్వరమంటే ఒక్క మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలే కాదు, వేల కిలోమీటర్ల సొరంగాలు, కాలువలు, ఎత్తిపోతలు, లిఫ్టులు, విద్యుత్ సబ్స్టేషన్లు. తెలంగాణ రైతాంగానికి భవిష్యత్ అందించినం. రాబోయే రోజుల్లో సోలార్ ప్యానళ్లతో కాళేశ్వరం సాగుతుంది. ఇదీ కేసీఆర్ విజన్. కాళేశ్వరం గురించి తెలియాల్సిన ప్రాథమిక సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాంగ్రెస్ దుష్ప్రచారాలను తిప్పికొడతాం. రాజకీయాలు మానుకొని రైతాంగానికి పంటలు ఎండిపోకుండా నీరందించే చర్యలు చేపట్టాలి.
– బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు