హుజూరాబాద్, అక్టోబర్ 18: తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, తనను ఆశీర్వదిస్తే హుజూరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడేళ్ల పాలనలో ఇక్కడి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు. తనకు సూటిగా మాట్లాడడం ఒకటే వస్తుందని, మాట చెప్తే కచ్చితంగా నెరవేరుస్తానని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి సాదుకుంటారో.. లేదంటే సంపుకుంటారో మీ ఇష్టం అని ఉద్వేగంతో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం వీణవంక, హుజూరాబాద్ మండలం, పట్టణంలో పర్యటించారు. వీణవంకలో పోతిరెడ్డిపల్లికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు, గౌడసంఘం నాయకుడు దూలం శ్రీనివాస్ సహా పది మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం హుజూరాబాద్‌లోని సిర్సపల్లి క్రాస్‌రోడ్‌లో బీరన్న దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, గొల్లకుర్మలతో చిట్‌చాట్ చేశారు. తాను గెలిస్తే భీరన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టణంలోని సిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఆపదలో పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం అక్కడే జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు.
ఆ తర్వాత కందుగుల, చిన్నపాపయ్యపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి గ్రామాల్లో పర్యటించి కార్యర్తలతో సమావేశమయ్యారు. కేసీఆర్ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని చెప్పారు. సాయంత్రం హుజూరాబాద్ 13, 16, 17, 18వ వార్డుల్లో పర్యటించి ముఖ్య కార్యర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నదని, అందరితోపాటు తాను కూడా బీఆర్ఎస్ కార్యకర్తనేనన్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నానని చెప్పారు.
బీఆర్ఎస్తో హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజూరాబాద్‌లో పార్టీ కార్యాలయం నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్, వైస్ చైర్పర్సన్లు గందె రాధిక, కొలిపాక నిర్మల, జడ్పీటీసీలు పడిదం బక్కారెడ్డి, శ్రీరాంశ్యాం, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, సోషల్ మీడియా వారియర్ పావని గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులున్నారు.