వీణవంక/ జమ్మికుంట, నవంబర్ 8: శిథిలావస్థలో ఉన్న కల్వల ప్రాజెక్ట్‌ను రూ.70 కోట్లతో పునరుద్ధరించి, రానున్న రోజుల్లో మినీ ఎల్ఎండీగా మార్చి పల్లెలను సస్యశ్యామలం చేస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, రెడ్డిపల్లి గ్రామాల్లో, జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట, శాయంపేట గ్రామాల్లో బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎన్నికల ప్రచారంలో పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, ‘తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు, రైతు బాంధవుడు కేసీఆర్‌తోనే సకల జనులకు భరోసా అన్నారు.
రైతుల కష్టాలను గుర్తించి పెట్టుబడికి రైతుబంధు, రైతుబీమా, తదితర పథకాలతో అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రూపొందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఏనాడూ రైతులు, ప్రజల గోసను పట్టించుకోలేదని, కేవలం ఎన్నికల సమయంలో వచ్చి వారు చెప్పే కట్టుకథలను ప్రజలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏడు సార్లు అవకాశం ఇచ్చి గెలిపించినా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.
అక్కాచెల్లెల్లారా, అన్నాదమ్ముల్లారా.. ఒక్కసారి ఆలోచన చేసి ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెచ్చి మరో సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జమ్మికుంటలో మాట్లాడుతూ, జమ్మికుంటను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని, నాయినిచెరువును టూరిస్ట్ స్పాట్‌గా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పల్లెల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, కార్యకర్తలు, ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వెయ్యడానికి వెళ్తున్నానని, తిరిగి విజయోత్సవ ర్యాలీలో కలుసుకుందామని అన్నారు.
మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, రెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఊరూవాడా కదిలిరాగా.. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రతి గ్రామంలో మహిళలు మంగళహారతులు పట్టారు. పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలు అందరినీ అలరించాయి. ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో మహిళలు, యువతులు, యువకులు, పురుషులు హాజరుకాగా, రోడ్లన్నీ గులాబీ జెండాలతో నిండగా, ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్.. జైజై కౌశికన్న’ నినాదాలతో గ్రామాలు మార్మోగాయి. ఘన్ముక్ల, రెడ్డిపల్లి గ్రామాల్లో యువతతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి నృత్యం చేయగా, ఆయన సతీమణి శాలినీరెడ్డి కోలాటం ఆడి అందరినీ అలరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘుపాల్‌రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్‌రావు, వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా, మండలాధ్యక్షులు నాగిడి సంజీవరెడ్డి, కాసం వీరారెడ్డి, సర్పంచులు జున్నూతుల సునీత-మల్లారెడ్డి, పోతుల నర్సయ్య, ఎంపీటీసీలు ఒడ్డెపెల్లి లక్ష్మి-భూమయ్య, ఉపసర్పంచులు శరత్‌రెడ్డి, వీరన్న, కొమురయ్య, గ్రామశాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, మండల సంపత్‌యాదవ్, ఇట్టవేన రాజయ్య, సింగిల్‌విండో డైరెక్టర్లు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జమ్మికుంట మండలంలో ఆయా గ్రామాల సర్పంచులు ఆగయ్య, రాచపెల్లి సదయ్య, చందుపట్ట స్వామి-కృష్ణారెడ్డి, ఆకినపెల్లి సుజాత, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, 1, 2వ వార్డు కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారపెల్లి భిక్షపతి, నాయకులు ఎ.సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి, గాజుల రవీందర్, రాజయ్య, శ్రీనివాస్, మధుకర్‌రెడ్డి, చింతల సుమన్, పోతుల సురేశ్, రాజు, రాపర్తి అఖిల్‌గౌడ్, పొన్నాల అనిల్ పాల్గొన్నారు.