హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 3 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డ్ ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన హుజూరాబాద్ బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య రంగాలు స్వచ్ఛందంగా పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.
దేశానికి నాణ్యమైన విత్తనాలను అందించే ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు నాశనమయ్యే ముప్పు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డంప్ యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ నెల 7, 8 తేదీల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో పాల్గొంటానని తెలిపారు. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయన వెంట అఖిల పక్ష నాయకులు, వ్యాపారులు తదితరులు ఉన్నారు.