Karimnagar Police | హుజూరాబాద్ టౌన్, జూలై 18 : హుజూరాబాద్ ఏసీపీ మాధవి భర్త, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ మహేష్ బాబు(55) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. వివరాల ప్రకారం.. డీసీపీ మహేష్ హుజూరాబాద్ ఏసీపీ నివాసంలో ఉండగా గుండెపోటు రాగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన సిబ్బంది, హుఠాహుటిన పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్రంగా శ్రమించి, సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది.
డీఎస్పీ మరణాన్ని వైద్యులు ధృవీకరించడంతో మృతదేహాన్ని కరీంనగర్ కు తరలించారు. తన భర్త మరణంతో ఏసీపీ మాధవితో పాటు కుటుంబ సబ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆసుపత్రిలో ఏసీపీ మాధవి విలపించిన తీరును చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఎస్సై నుంచి ఇద్దరు ఒకేసారి సీఐ, డీఎస్పీగా ప్రమోషన్ పొంది పలుచోట్ల పనిచేసి ఫ్రెండ్లీ పోలీసుగా పలువురి మన్ననలు అందుకున్నారు.
మహేష్ మృతి పట్ల పలువురు సంతాపం
1992 బ్యాచ్ కి చెందిన మహేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు, సీఐలు టీ కరుణాకర్, పులి వెంకట్ గౌడ్, తహసీల్దార్ కే కనకయ్య, కమిషనర్ కే సమ్మయ్య, పలువురు పాత్రికేయులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా అంత్యక్రియల నిమిత్తం డీఎస్పీ మహేష్ బాబు మృతదేహాన్ని కరీంనగర్ కు తరలించారు.