అక్కన్నపేట, నవంబర్ 1: ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దేనని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని నందారం, కపూర్‌నాయక్‌తండా, తురుకవానికుంట, పోతారం(జే), ధర్మారం, మసిరెడ్డితండా, మల్‌చెర్వుతండా, రేగొండ, గోవర్థనగిరి, బొడిగపల్లి గ్రామా ల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు వచ్చీపోయే పార్టీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
పొరపాటున కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మన బతుకులు ఆగం అవుతాయన్నారు. మన చావు మనమే కొని తెచ్చుకున్నట్లు ఉంటుందన్నారు. అప్పుడు మన పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉంటుందని తెలిపారు. ఆ పార్టీలు ఢిల్లీలో ఓ మాట, గల్లీలో ఓ మాట మాట్లాడుతూ మోసాలు చేస్తాయన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఢిల్లీ గులాంల చేతుల్లోకి పోనివ్వకుండా గస్తీ చేపట్టాలన్నారు. ఇందుకోసం బాగా, ఆలోచించి, కారు గుర్తుకు ఓటేసి, భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. హ్యాట్రిక్‌గా ప్రభుత్వ ఏర్పాటులో అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కానీ, ప్రతిపక్షాల మాయ మాటలు విని నమ్మితే మోసపోయి గోస పడుతామన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావాలన్నారు. ఆ పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని హితవు పలికారు. ఒకప్పుడు కనీస మౌలిక వసతులు లేని, గ్రామాలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. ఈ అభివృద్ధిని నిరంతరం కొనసాగించేందుకు బీఆర్ఎస్కే ఓటు వేయాలని సూచించారు. మూడోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపెడుతానన్నారు. కాగా, గ్రామాల్లో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ఆదరణ వెల్లువెత్తుతున్నది. ఉప్పెనలా ప్రచారం కదిలింది. డప్పుచప్పుళ్లు, మంగళహారతులు, బోనాలు, కోలాటాలుతో మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్య మంగ, నేషనల్ లేబర్ కోఆపరేటివ్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజిని, మండల ఇన్చార్జులు మ్యాక నారాయణ, కాసర్ల అశోక్‌బాబు, లింగాల సాయన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలూనాయక్, రామచంద్రం, పెండెల రమాదేవి, రైతుబంధు మండల అధ్యక్షుడు కందుల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.