మెట్పల్ల్లి, మార్చి 2 : సంతోషంగా బంధువుల పెళ్లికి బయలు దేరిన ఆ భార్యాభర్తలను విధి వెంటాడింది. బస్సు ఢీకొని భర్త అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన భార్య దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఎఖీన్‌పూర్‌కు చెందిన జవిడి నర్సారెడ్డి (64)తన భార్య అనసూయ(60)తో కలిసి మల్లాపూర్ మండలం వేంపల్లిలో జరుగుతున్న బంధువుల వివాహానికి మోటర్ సైకిల్‌పై ఆదివారం ఉదయం బయలుదేరాడు. మార్గమధ్యలో మెట్పల్లి శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నర్సారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు.
అనసూయకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక దవాఖానకు తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. శుభకార్యానికి వెళ్తూ మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. నర్సారెడ్డికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సీఐ నిరంజన్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.