సిరిసిల్ల టౌన్, జూలై 29 : తనకు కిడ్నీ మార్పించలేదని ఓ భర్త క్షణికావేశానికి లోనయ్యాడు. భార్యను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన దూస రాజేశం(62), లక్ష్మి(54) దంపతులకు ఇద్దరు, ఒక కూతురు ఉన్నారు.
రాజేశం కొతం కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు సిరిసిల్లలోని ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ చికిత్స చేయిస్తున్నారు. తనకు కిడ్నీ మార్పిడి చేయించాలని రాజేశం చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. డోనర్ దొరకగానే మార్పిడి చేపిస్తామని నచ్చజెబుతూ డయాలసిస్ చేయిస్తున్నారు.
అయితే మెరుగైన వైద్యం చేయించడం లేదన్న ఆగ్రహంతో ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజేశం తన భార్య లక్ష్మి తలపై గాయపరిచాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, తర్వాత ఆయన కూడా ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.