హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని వందశాతం అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పథకంపై క్లస్టర్ అధికారులు, మండల రిసోర్స్ పర్సన్లు, డైరీ అధికారులు, బ్యాంకర్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 17,035 మంది ఖాతాల్లో నగదు జమ చేశామని మిగిలిన అర్హులైన 760 మంది బ్యాంకు ఖాతాల్లో ఈనెల 27వ తేదీలోగా నగదు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకానికి ఎంపికై ఖాతాలో నగదు జమ అయిన వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను మార్పు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని కలెక్టర్ అన్నారు. డైరీ యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇంతకుముందు పెట్టుకున్న యూనిట్లలో ఏమైనా మార్పులు ఉంటే సరి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
ప్రతి వారం 200 యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అధికారులకు సూచించారు. పదిమంది ఒక బృందంగా ఏర్పడి కూడా యూనిట్లను స్థాపించుకునే వీలుందని అన్నారు. మినీ డైరీ కోసం 20 మంది ఒక బృందంగా ఏర్పడి సొసైటీ ఏర్పాటు చేసుకొని డైరీ యూనిట్లు స్థాపించుకునేందుకు ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు గ్రామాల వారిగా వారు స్థాపించుకునే యూనిట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్ లేదా హైదరాబాదులో శిక్షణ కూడా ఇప్పిస్తామని అన్నారు.
దళిత బంధు పథకాన్ని పక్కాగా, పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు తమ యూనిట్లను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకునే వీలుందని కలెక్టర్ తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని హుజురాబాద్ ఆర్డిఓ కార్యాలయం పక్కన ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
దళిత బంధు పథకానికి అర్హులై ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఎంపీడీవోల దగ్గర దరఖాస్తు చేసుకుంటే దళిత బంధు పథకం వర్తింపచేస్తామని కలెక్టర్ తెలిపారు. యూనిట్లను ఎంపిక చేసుకునేందుకు లబ్ధిదారులకు రిసోర్స్ పర్సన్స్ అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ కోరారు.
అనంతరం కరీంనగర్ డైరీ, విజయ డైరీ అధికారులు డైరీ యూనిట్లు స్థాపించుకుంటే కలిగే లాభాలపై రిసోర్స్ పర్సన్ లకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, హుజూరాబాద్ ఆర్డిఓ రవీందర్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి సురేష్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, డీఆర్డీఓ శ్రీలత, క్లస్టర్ అధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గం ఎంపీడీవోలు, తహసీల్దార్లు, రిసోర్స్ పర్సన్లు, బ్యాంకు మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.