దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తాకిడి ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మొకులు చెల్లించుకునే ఆనవాయితీ ఉన్నది. అందులో భాగంగానే నగదు కానుకలను కూడా హుండీలో వేసి, మొక్కుకోవడం కనిపిస్తున్నది. ఈ హుండీ నగదు కానుకల ద్వారా స్వామివారికి ఏటా 34 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుండగా, కానుకల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నేరుగా హుండీలో నుంచి నగదు చోరీ చేయడం చూస్తే అధికారుల పర్యవేక్షణ లోపమే అందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేములవాడ, డిసెంబర్ 26: రాజన్న ఆలయంలో హుండీలను ప్రతి పది పదిహేను రోజులకోసారి లెక్కిస్తుంటారు. రద్దీ ఎక్కువ ఉన్న సందర్భాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే డిసెంబర్ 4న చివరిసారిగా హుండీలను లెకించారు. సుమారు 22 రో జులు కావస్తుండడం, అటు భక్తుల తాకిడి కూడా అధికంగా ఉండడంతో రాజన్న అంతర్ ఆలయంలో హుం డీలు నగదుతో నిండిపోయాయి. అంతర్ ఆలయంలో మొత్తం నాలుగు పెద్ద హుండీలు ఉండగా, అందులో ఇప్పటికే మూడు ఫుల్ అయ్యాయి.
అలాగే మరో నా లుగు చిన్న హుండీలు కూడా నిండిపోవడంతో వాటికి సీల్ వేసి పకకు పెట్టారు. ఆలయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో లెకింపు ఆలస్యమైనట్టు తెలుస్తుండగా, ఇదే అదునుగా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు వారం పది రోజులుగా హుండీలోని నగదును కొట్టేసినట్టు వెలుగులోకి వస్తున్నది. ఇప్పటికే రెండు దఫాలుగా నగదును కొట్టేసి, మూడోసారి బుధవారం అంతర ఆలయంలోని హుం డీ నుంచి నగదు తీస్తూ చిక్కారు. అయితే చో రీకి పాల్పడింది మైనర్లు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, కరీంనగర్లోని బాలసంరక్షణ కేంద్రానికి పంపారు. చోరీకి గురైన హుండీని సైతం అధికారులు బుధవారం నాడు రాత్రి మూసివేసినట్టు తెలిసింది.
రాజన్న ఆలయంలో భద్రతా సిబ్బందే హుండీలకు కన్నం వేసిన సంఘటన 2007లోనే జరిగింది. అప్పుడు సాక్షాత్తూ ధ్వజస్తంభం వద్ద హుండీలు వంచి, నగదు తీస్తున్న వీడియోలను గుర్తు తెలియని వ్యక్తులు బహిర్గతం చేయడం రాష్ట్ర దేవాదాయ శాఖను కుదిపేసింది. ఆనాడు ఇద్దరు ఎస్పీఎఫ్ సిబ్బంది సస్పెన్షన్ కాగా, మరొకరిపై బదిలీ వేటు పడింది. తాజాగా రాజన్న ఆలయంలోని అంతర్ ఆలయంలో హుండీల నుంచి మైనర్లు నగదు చోరీ చేయడం అనుమానాలకు తావిస్తున్నది.
ఆలయంలో 11 మంది ఎస్పీఎఫ్ భద్రత సిబ్బంది, మరో 25 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నా చోరీ జరగడం చూస్తే ‘భద్రత పటిష్టమేనా..?’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడడంతోపాటు భక్తుల విశ్వాసాలను దెబ్బతీయకుండా చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ హుండీ నగదు అపహరణపై చర్చించాల్సింది పోయి.. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది? ‘నమస్తే తెలంగాణ’లో కథనం ఎలా వచ్చిందో తెలుసుకోవడంపై దృష్టి పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.