వేములవాడ, డిసెంబర్ 25: వేములవాడ రాజరాజేశ్వరుడి క్షేత్రంలో భద్రత కరువవుతున్నదా..? సిబ్బంది పర్యవేక్షణ కొరవడుతున్నదా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సాక్షాత్తూ ఆలయ హుండీలకే కన్నం వేయడం చూస్తుంటే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. నాలుగు రోజులుగా మైనర్లు చోరీకి పాల్పడుతున్నా గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. రాజన్న ఆలయంలో మొత్తం నాలుగు పెద్ద హుండీలు, ఎనిమిది చిన్న హుండీలు ఉన్నాయి. ఇటీవల భక్తుల నుంచి నగదు కానుకలు పెరిగి హుండీలు నిండిపోయాయి.
బుధవారం ముగ్గురు మైనర్లు సాధారణ భక్తుల్లా రాజన్న ఆలయం లోపలికి వచ్చి, హుండీలోని నగదు దొంగలిస్తూ సిబ్బందికి చిక్కారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి రూ.2800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసు విచారణలో ఆదివారం కూడా రూ.7వేలు కాజేసినట్టు తెలిసింది. ఆలయ భద్రత సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్టు వేములవాడ పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ తెలిపారు.