మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న క్షేత్రం సిద్ధమైంది. నేటి నుంచి మూడురోజులపాటు అంత్యత వైభవోపేతంగా జరిగే వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాత్రి వేళ విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీనుతున్నది. జాతరకు రాష్ట్రంతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు తరలిరానుండగా, అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాగునీరు, వసతి, పారిశుధ్యం, పార్కింగ్ స్థలాలతోపాటు పట్టణంలో ఆరోగ్య కేంద్రాలు, హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. మరోవైపు పోలీస్ శాఖ పట్టిష్ట భద్రత కల్పిస్తున్నది. తిరుపతి నుంచి రాజన్నకు పట్టు వస్ర్తాలు రానుండగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున శనివారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 16 : మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేసి, అన్ని ఏర్పాట్లూ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌బాబు సూచనల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిళ్లు వేశారు. మునుపెన్నడూ లేని విధంగా 24 లక్షలతో రాజన్న ఆలయ ప్రాంగణం, పరిసరాలు, జాత్రాగ్రౌండ్, టీటీడీ ఆలయం ఎదుట, జగిత్యాల బస్టాండ్, మెయిన్ బస్టాండ్, వేములవాడ పుర వీధుల్లో విద్యుత్ దీపాలను అమర్చారు. శివార్చన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వచ్చే కళాకారులకు 30 లక్షలు ఖర్చుచేస్తున్నారు.
పూర్తయిన ఏర్పాట్లు
భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సేదతీరేందుకు ఆలయ పరిసరాలు, బద్దిపోచమ్మ ఆలయం వద్ద, టీటీడీ, జాత్రాగ్రౌండ్, మెయిన్ బస్టాండ్ ప్రాంతం, జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలో 41.80 లక్షలతో 3 లక్షలా 29 వేల చదరపు అడుగుల చలువ పందిళ్లు వేశారు. దర్శనం సులువుగా జరిగేందుకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఆలయం ద్వారా 1.60లక్షలతో రెండు లక్షల వాటర్ ప్యాకెట్స్, దాతల ద్వారా లక్ష మజ్జిగ ప్యాకెట్లు అందజేయనున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పాస్ తీసుకున్న ప్రతి భక్తుడు విధిగా 100తో టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. తాగునీటి కోసం ఏడు ఫ్రిడ్జ్‌లను అందుబాటులోకి తెచ్చారు. రాజన్న జలప్రసాదం పేరిట దాదాపు ఒక్కొక్కటి 9 లక్షలతో మెగా కంపెనీ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే చంటి పిల్లలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 5 లక్షలతో ఆలయ ప్రాంగణంలో రెండు బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతోపాటు వివిధ చోట్ల 3 లక్షలతో ఏడు ‘మే ఐ హెల్ప్‌యూ’ సెంటర్లను ఏర్పాటు చేశారు. జాతర జరిగే మూడు రోజులు డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు నేతృత్వంలో 500 మంది వైద్య సిబ్బంది ఆయా కూడళ్లలో భక్తులకు వైద్యసేవలందించడానికి సిద్ధమయ్యారు. వేములవాడ, సిరిసిల్ల సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు సాంబశివరావు, సతీశ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది వలంటీర్లు భక్తులకు సహాయం అందించనున్నారు.
ధర్మగుండంలో శుభ్రమైన నీరు
రాజన్న ధర్మగుండంలో స్నానాలు చేసేందుకు శుభ్రమైన నీటిని నింపి ఉంచారు. చెరువులోని పార్కింగ్ స్థలం పక్కనే 10 లక్షలతో 167 షవర్లు ఏర్పాటు చేశారు. మరో 10 లక్షలతో 106 దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రాజన్నకు పట్టు వస్ర్తాలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేములవాడ రాజన్నకు పట్టువస్ర్తాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా శనివారం ఉదయం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. తిరుపతి వెంకన్న దగ్గరి నుంచి రాజన్నకు శనివారం ఉదయం పట్టువస్ర్తాలు సమర్పిస్తారని తెలిపారు.
దక్షిణ ద్వారం నుంచి బయటికి
రాజన్న దర్శనం అనంతరం ఆలయం వెనుక వైపు గల దక్షిణ ద్వారం నుంచి బయటకు వెళ్లాలని అధికారులు తెలిపారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం నాగిరెడ్డి మండపం వద్దగల క్యూలైన్ల నుంచి వచ్చి బయటికి వెళ్లాల్సిందిగా కోరుతున్నారు. అలాగే భక్తుల కోసం మొత్తం 3 లక్షల 50 వేల లడ్డూలను సిద్ధంగా ఉంచినట్టు ఆలయ ఏఈవో ప్రతాప నవీన్, పర్యవేక్షకుడు రాజశేఖర్ వెల్లడించారు.
ప్రత్యేక పార్కింగ్
భక్తులు వాహనాలను పార్క్ చేయడానికి పట్టణ శివారులో ఎనిమిది చోట్ల స్థలాలను ఏర్పాటు చేశారు. ఏ రూట్లో వచ్చిన వాహనం ఆ దారి సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలంలో నిలపాలని అధికారులు సూచిస్తున్నారు.
పకడ్బందీ భద్రత
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి బాంబ్‌స్కాడ్, పోలీసు జాగిలాలతో అణువణువూ పరిశీలించారు. భద్రత కోసం 1200 మంది పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారని పోలీస్ అధికారులు తెలిపారు. ఒక ఎస్పీ, ఏఎస్పీతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 150 మంది ఏఎస్ఐలు, 500 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్ విధుల్లో ఉండనున్నారు. పట్టణంలోని ప్రధాన లాడ్జిలు, వసతి గదులపై ప్రత్యేక దృష్టిసారించారు. గురువారం జాతర ప్రత్యేక విధులకు హాజరైన అధికారులు, సిబ్బందికి వేములవాడలోని మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ దిశానిర్దేశం చేశారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపారు.