హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 24 : ఇంటి ముందు నల్లా ఆన్ చేసిన అగంతకులు.. ఆ శబ్ధానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దంపతులపై కత్తులతో దాడి చేసి భారీ దోపిడీకి ఒడిగట్టారు. 70 తులాల బంగారంతో పాటు రూ.7 లక్షల నగదుతో ఉడాయించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడలో ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు ఇంటి ఆరుబయట ఉన్న మోటర్‌ను ఆన్ చేశారు.
దీంతో ట్యాంక్ నిండి నీళ్లు బయటికి రావడాన్ని గమనించారు. ఈ సమయంలో మోటర్‌ను ఎవరు ఆన్ చేశారని.. రాఘవరెడ్డి భార్య వినోద ఆఫ్ చేయాలని బయటకు వచ్చేందుకు తలుపు తీయగానే ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి రాఘవరెడ్డితోపాటు అతడి భార్యపై దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కూతురు మానస, అలికిడి విని తల్లిదండ్రులను కాపాడేందుకు రావడంతో ఆమె గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. రాఘవరెడ్డిపై కత్తితో దాడి చేసేందుకు రాగా తనను తాను రక్షించుకునేందుకు వారితో కాసేపు తగువులాడుతున్న సమయంలో దుండుగుల కత్తి ఒకటి విరిగిపోయి రాఘవరెడ్డి చేతులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో వినోదపైనా కత్తులతో దాడి చేశారు.
బంగారం డబ్బు ఎకడ ఉందంటూ ఆరా తీస్తూ, చెప్పకపోతే అందరిని చంపేస్తామని బెదిరించారు. తమను చంపవద్దని ప్రాధేయపడి, బీరువా తాళం ఇవ్వడంతో బీరువాలోని రూ.7 లక్షల నగదు, 70 తులాల బంగారం దోచుకెళ్లారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. దుండగులు బయటికి వెళ్లేప్పుడు తమని లోపలికి నెట్టేసి బయట గడియ పెట్టారని, వారు వెళ్లగానే మొదటి అంతస్తులో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకి ఫోన్ ద్వారా విషయం చెప్పడంతో అతడు వచ్చి తీశారని తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న హుజూరాబాద్ టౌన్ సీఐ తిరుమల్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కరీంనగర్ నుంచి క్లూస్ టీం, టెక్నికల్ టీంతోపాటు డాగ్ స్వాడ్ని రప్పించి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో దగ్గర బంధువుల హస్తం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.