చిగురుమామిడి, జనవరి 27: ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు శిబిరాలకు చక్కని స్పందన లభిస్తున్నది. శుక్రవారం చిగురుమామిడి, ములనూర్ గ్రామాల్లో కంటి పరీక్షలకు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కంటి పరీక్షల అనంతరం వారికి ఉచితంగా మందులు, అవసరమైన వారికి కండ్ల అద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు ప్రత్యూష, శ్రీనివాస్ తెలిపారు. కంటి వైద్య శిబిరంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, జనవరి 27: మండలంలోని చెంజర్ల, లక్ష్మీపూర్‌లో శుక్రవారం ‘కంటి వెలుగు’ శిబిరం నిర్వహించారు. చెంజర్లలో 166 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. ఇందులో 25 మందికి కళ్ల అద్దాలు అందజేశారు. ఏడుగురికి ప్రత్యేక కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. లక్ష్మీపూర్‌లో 141 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16 మందికి కంటి అద్దాలు అందజేశారు. 14 మందికి ప్రత్యేక అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. శిబిరాలను సీహెచ్‌వో రాజూనాయక్ పరిశీలించారు. ఆయా చోట్ల డాక్టర్ మైథిలీ, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది ఉన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, జనవరి 27: మండలంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఇల్లందకుంటలో 126 మందికి, సిరిసేడులో 130 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేక వైద్యశిబిరం క్లస్టర్ అధికారి మోహన్‌రెడ్డి, వైద్యులు దివిజ, నాగలక్ష్మి, అనురాగరేఖ, సూపర్వైజర్లు అనిత, శ్యామల, వైద్య సిబ్బంది ఉన్నారు.
సైదాబాద్‌లో..
జమ్మికుంట రూరల్, జనవరి 27: మండలంలోని సైదాబాద్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం సర్పంచ్ పుప్పాల శైలజారాజారాం ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన గ్రామస్తులకు వైద్యులు కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక్కడ ఉప సర్పంచ్ రాజయ్య, ఎంవో మౌనిక, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కళ్లద్దాలు
శంకరపట్నం, జనవరి 27: కంటి వెలుగు శిబిరాల్లో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇస్తున్నట్లు కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కొత్తగట్టు, కేశవపట్నం గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేశవపట్నం శిబిరంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ ఒక్కరికీ నేత్ర సంబంధమైన వ్యాధులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండో సారి అమలు చేస్తోందన్నారు. ఆయా గ్రామాల శిబిరాలలో నేత్ర వైద్య నిపుణులు పరీక్షలు జరిపి కంటి జబ్బులు ఉన్న వారికి అవసరమైన మందులు, కళ్ల అద్దాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేశవపట్నం హెల్త్ క్యాంపులో మొత్తం 139 మందికి, కొత్తగట్టు వైద్య శిబిరంలో మొత్తం 146 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే రెండు గ్రామాల్లో కలిపి 71 మందికి అవసరమైన మందులు, 43 మందికి రీడింగ్ గ్లాసెస్ అప్పటికప్పుడు ఇవ్వగా, మరో 64 మందికి అవసరమైన ప్రత్యేక సైట్ గల కంటి అద్దాలను అందజేయనున్నట్లు వైద్యాధికారి తెలిపారు. కాగా 12 మంది వృద్ధులకు కాటరాక్ట్ సర్జరీలకు రెఫర్ చేసినట్లు చెప్పారు. క్యాంపు కో ఆర్డినేటర్లు అనిల్‌కుమార్, ఎండీ సాజిత్, క్యాంపు వైద్యాధికారులు డాక్టర్ సుమన్, డాక్టర్ కీర్తన, ఆప్తమెట్రిస్ట్లు కేసర్ నందన్, రుచిత, పంచాయతీరాజ్ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.