రవీంద్రభారతి, అక్టోబర్ 29 : చట్టసభల్లో సగరులు ఎదగాలని క్రీడా యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం రవీంద్రభారతిలోని మెయిన్‌హాల్‌లో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర ఆధ్వర్యంలో సగర ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. కోకాపేటలో సగర కులస్థులకు కేటాయించిన రెండు ఎకరాల స్థలం, రెండుకోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ , ఎంపీ ఈటల రాజేందర్లు మాట్లాడుతూ.. కులాల వారీగా కాకుండా బీసీలుగా అందరం కలిసి ఉండి ఉద్యమం చేసినప్పుడే రిజర్వేషన్లు సాధించుకున్నవాళ్లమవుతామన్నారు. సగరుల జీవనస్థితిగతులను దృష్టిలో పెట్టుకొని వారిని బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంలో జరిగే ఉద్యమానికి తమ వంతు సహాయం అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో వెనుకబడిన తరగతులకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ కోకాపేటలో ఇచ్చిన స్థలంలో సగర విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ నిర్మాణం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సగర సంఘం నాయకులు ముత్యాల హరికిషన్, సత్యం సగర, మారుతీ సగర, కుమారస్వామి సగర, బీఆర్ ఆంజనేయులు సగర, సతీశ్ సగర, రవి,స్రవంతి, సురేశ్ సగర, మహేందర్ సగర, తదితరులు పాల్గొన్నారు.