హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల కారణంగా రెండు రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేసి మానవతా సాయం చేసిన పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. బుధవారం డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు.
ఈ సందర్భంగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ పోలీసు అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సరవయ్య, డోర్నకల్ సీఐ చంద్రమౌళి, సిబ్బంది, రైల్వేస్టేషన్‌కు చేరుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మానవతా దృక్పథంతో సాయం చేశారు. భారీ వర్షాల్లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు సాయం చేసినందుకు డీజీపీ పోలీసు సిబ్బందిని ప్రశంసించారు.