Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 17: రామగుండం నగర పాలక సంస్థలో స్వచ్ఛత హీ సేవా ర్యాలీని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అధికారులు, సిబ్బందిచే కలిసి ర్యాలీలో నడక సాగించారు. పక్షం రోజుల పాటు చేపడుతున్న స్వచ్ఛత హీ సేవాలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.
బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ముందుగా ఆమె జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజని గుర్తు చేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తాగునీరు, పారిశుధ్య శాఖ, జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం స్వచ్ఛోత్సవ్ థీమ్ తో స్వచ్ఛత హీసేవా బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
రెండు వారాలు పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కలిగేలా ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలన్నారు. ప్రతి ఇల్లు, వాడ, ఊరు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన పెంపొందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. తాము పాల్గొనడంతోపాటు మరో వంద మంది పాల్గొనే విధంగా చేస్తామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
మున్సిపల్ అధికారులు, సిబ్బంది మెప్మా సిబ్బంది. స్వశక్తి మహిళలు ర్యాలీగా గోదావరిఖని చౌరస్తాకు చేరుకుని అక్కడ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ ఉమా మహేశ్వరరావు, ఈఈ రామన్, అకౌంట్ ఆఫీసర్ రాజు, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆర్ ఐ శంకర్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కంకర్ రావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక, సీఓలు, ఆర్పిలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.