జగిత్యాల సమీపంలోని హన్మాన్సాయి రైస్‌మిల్లుపై సివిల్ సైప్లె, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు చేశారు. భారీగా పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి పక్కాగా పథకం వేసిన అధికారులు.. కూలీలుగా అవతారమెత్తి నిఘా పెట్టడమే కాదు, రెడ్‌హ్యాండెడ్‌గా ట్రక్కును పట్టుకున్నారు. అయితే, వివరాలు వెల్లడించడంపై హైడ్రామా కొనసాగించారు. కాగా, రైస్‌మిల్‌పై చర్యలు తీసుకోవడంలో అధికారులపై పొలిటికల్ ప్రెషర్ ఉన్నట్లు తెలుస్తున్నది.
జగిత్యాల, జూన్ 24, (నమస్తే తెలంగాణ)/జగిత్యాల రూరల్ : జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘురాములకోట గ్రామ శివారులో ఉన్న హన్మాన్సాయి రైస్‌మిల్లుపై సివిల్ సైప్లె, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేశారు. భారీగా పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. హన్మాన్ సాయి రైస్‌మిల్లులో కొన్నాళ్లుగా పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ వ్యవస్థ పెద్ద ఎత్తున నడుస్తున్నట్టు అధికారులకు సమాచారం ఉన్నది. పీడీఎస్ రైస్‌ను సేకరించి, వాటిని నల్లబజార్‌కు తరలిస్తున్నట్టు, సీఎంఆర్‌కు సైతం వినియోగిస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులు సోమవారం అర్ధరాత్రి రైస్‌మిల్లు వద్దకు వచ్చారు. అదే సమయంలో ట్రక్కుల్లో బియ్యం సంచులు మిల్లులోకి రావడం గమనించి, రైస్‌మిల్లుపై దాడి చేశారు. ట్రక్కులో వచ్చిన బియ్యాన్ని పరిశీలించడంతోపాటు రైస్‌మిల్లులో బియ్యం నిల్వలు పెద్ద మొత్తంలో ఉన్నట్టు గుర్తించారు. అర్ధరాత్రి స్థానిక పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చి, రైస్‌మిల్లు వద్ద పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ట్రక్కులోని బియ్యంతోపాటు మిల్లులోని బియ్యాన్ని పీడీఎస్ బియ్యమా.. కాదా..? అన్నది తేల్చేందుకు పరీక్షకు పంపించారు. కాగా, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రైస్‌మిల్లులో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెండు లారీలు, ఒక డీసీఎంఎస్ వ్యాన్ ద్వారా మరో చోటుకు తరలించామన్నారు. రైస్‌మిల్లులో లభ్యమైన బియ్యం ఎన్ని క్వింటాళ్లు ఉంటాయనే విషయంపై అర్ధరాత్రి వరకు స్పష్టత వస్తుందన్నారు. రైస్‌మిల్లు యజమాని కొండ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కూలీల అవతారంలో నిఘా?
హన్మాన్ సాయి రైస్‌మిల్లుపై అధికారులు పకడ్బందీ పథకంతో దాడి చేసినట్టు తెలుస్తున్నది. జగిత్యాలకు చెందిన రైస్‌మిల్లర్ల యజమాని పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారని, అవినీతి భారీ స్థాయిలో ఉందన్న ఫిర్యాదులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చేరాయి. నిత్యావసర సరుకులను నల్లబజార్‌కు తరలించిన ఘటనలో రైస్మిల్లరుపై గతంలోనే సెక్షన్ 6 ఏపై పలుసార్లు, అలాగే ఎనిమిదేండ్ల క్రితం పీడీ యాక్ట్ కింద కేసు నమోదైనా బియ్యం దందా తగ్గలేదన్న ఫిర్యాదులు సివిల్ సైప్లె ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చేరినట్టు తెలుస్తున్నది. సంబంధిత శాఖ స్థానిక అధికారులు, కొందరు ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకోలేకపోతున్నారన్న విషయం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. మూడు రోజుల క్రితమే జగిత్యాలకు వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జగిత్యాలలోనే మకాం వేసి రఘురాములకోట గ్రామ శివారులో ఉన్న హన్మాన్ సాయి రైస్‌మిల్లుపై దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. సోమవారం రాత్రి ఇద్దరు అధికారులు కూలీల అవతారంలో రైస్‌మిల్లు సమీపంలోనే నిఘాపెట్టగా, అర్ధరాత్రి బియ్యం లోడుతో ఉన్న ట్రక్కు రైస్‌మిల్లు వైపునకు రావడాన్ని గుర్తించి దాన్ని వెంబడిస్తూ రైస్‌మిల్లులోకి చేరుకొని ట్రక్కును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, లోకల్ పోలీసులతో రాత్రిపూట రైస్‌మిల్లులో గస్తీ ఏర్పాటు చేయించారు.
పొద్దంతా హైడ్రామా !
పెద్ద మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సమాచారం మంగళవారం ఉదయం స్థానిక రెవెన్యూతో పాటు, సివిల్ సైప్లె అధికారులకు తెలిసింది. అలాగే, మీడియాకు సైతం వివరాలు తెలిశాయి. అయితే, రైస్‌మిల్లుపై దాడి, బియ్యం స్వాధీనానికి సంబంధించిన వివరాలు తెలియజేసే విషయంలో ఏ అధికారి కూడా అందుబాటులోకి రాలేదు. రైస్‌మిల్లుకు వెళ్లి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, రాత్రిపూట దాడి చేసి బియ్యం నిల్వలను, బియ్యం లోడుతో ఉన్న ట్రక్కులను స్వాధీనం చేసుకున్నామని, పూర్తి వివరాలు తెలియవని చెప్పడం గమనార్హం. మధ్యాహ్న సమయంలో అధికారులను కలిసి వివరాల కోసం ప్రయత్నించగా, రైస్‌మిల్లులోని బియ్యం శాంపిల్స్ సేకరించామని, అవి పీడీఎస్ బియ్యమా.. కాదా? అన్నది నిర్ధారణ కోసం పరీక్షకు పంపించామని పేర్కొన్నారు. రాత్రి 8 గంటల సమయంలో వివరాల గురించి అధికారులను సంప్రదించగా, ఎన్ని క్వింటాళ్లు, టన్నులు అనే వివరాలు చెప్పలేమన్నారు. రైస్‌మిల్లులో ఉన్న బియ్యాన్ని బస్తాల్లోకి చేర్చుతున్నామని, రెండు లారీలు, ఒక డీసీఎం వ్యాన్‌లో సరిపోయేన్ని బియ్యం ఉండొచ్చని ఉజ్జాయింపుగా పేర్కొన్నారు. బియ్యాన్ని సంచుల్లోకి నింపిన తర్వాత వాటిని తూకం వేసి పూర్తి వివరాలు చెబుతామన్నారు. అర్ధరాత్రి వరకు తూకం వేసే అవకాశాలున్నాయన్నారు.
అధికారులపై పొలిటికల్ ఒత్తిడి?
రైస్‌మిల్లుపై దాడి, బియ్యం స్వాధీనం విషయంలో సివిల్ సైప్లెతోపాటు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై పెద్ద స్థాయిలో పొలిటికల్ ఒత్తిడి వచ్చినట్టు సమాచారం. రైస్‌మిల్లులో దాడి సమయంలో సైతం అధికారులతో మిల్లు యజమాని కొండ లక్ష్మణ్ వాగ్వాదానికి దిగినట్లు పలు మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అలాగే, పలువురు అధికారులకు మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జిల్లాలో కీలక స్థాయిలో పనిచేస్తున్న అధికారుల నుంచి విషయాన్ని వదిలిపెట్టాలని ఒత్తిడి వచ్చినట్టు సమాచారం. విషయం బయటకు పొక్కిందని, మీడియాకు తెలిసిందని, వదిలిపెట్టడం ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పగా, అయితే వీలైనంతగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేయాలని, సాధారణ స్థాయిలో కేసులు రాసేలా చూడాలని కొందరు ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించినట్టు తెలుస్తున్నది.