రుద్రంగి, ఆగస్టు 10 : ప్రజాపాలన అంటే రైతులను గోసపెట్టడమేనా అని బీఆర్ఎస్ రుద్రంగి మండలాధ్యక్షుడు దేగావత్ తిరుపతి ప్రశ్నించారు. వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నదని, యూరియా కోసం సొసైటీల చుట్టూ ఇంకెన్ని రోజులు తిరగాలని ఆగ్రహించారు. ప్రభుత్వం స్పందించి పంటలకు సరిపడా అందించాలని డిమాండ్ చేశారు. ఆదివారం రుద్రంగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడారు. రైతులకు యూరియా, ఎరువులు, రైతుభరోసా, నాణ్యమైన కరెంట్, సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ఇరవై రోజుల నుంచి రైతులు యూరియా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన చెందారు. తాము పడుతున్న బాధలను మీడియాకు స్వచ్ఛందంగా చెప్పుకొన్న రైతులను కాంగ్రెస్ నాయకులు బెదిరించడం సరికాదని హెచ్చరించారు.
రైతులకు ఆధార్ కార్డుపై ఒక బస్తా యూరియా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం వరి, మక్క చేన్లకు యూరియా అవసరమని తెలిపారు. మానాల సొసైటీ నుంచి 80 మోట్రిక్ టన్నుల యూరియాకు డబ్బులు కడితే 30మోట్రిక్ టన్నులే వచ్చిందన్నారు. ఇది ఎవరికి సరిపోతుందని ప్రశ్నించారు. సిరిసిల్ల గోదాంలో నిల్వ ఉంచిన యూరియాను గ్రామాలకు తెచ్చి వెంటనే రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గంగం మహేశ్, మంచె రాజేశం, కంటె రెడ్డి, చెప్యాల గణేశ్, దుబ్బ రవి, అల్లూరి గంగారెడ్డి, కాదాసు లక్ష్మణ్, బోయిని చంద్రయ్య, ఉప్పులూటి గణేశ్, తలారి నర్సయ్య, గొళ్లెం నర్సింగ్, గెంటె ప్రశాంత్, పెద్దులు, గంగారెడ్డి, గంగాధర్, మణిదీప్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.