కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 27: కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావుపై సోమవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి అవిశ్వాస నోటీసులు అందించారు. ఇటీవల మేయర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అవిశ్వాస నోటీసులు అందించింది. ఆ నోటీసులపై బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్‌తో కలిసి 26 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆరుగురు కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు సైతం సంతకాలు చేశారు. ఈ నోటీసులను డిప్యూటీ మేయర్‌తో కలిసి కార్పొరేటర్లు కలెక్టర్‌కు అందించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు రాజేందర్రావు, మహేశ్, మాధవి, స్వరూపారాణి మాట్లాడుతూ పార్టీ మారిన మేయర్‌పై ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు తెలిపేందుకే ఈ అవిశ్వాస నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారంతో పాలకవర్గ పదవీ కాలం ముగుస్తుందన్న విషయం తెలుసని, మేయర్ తీరుపై కార్పొరేటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేందుకే ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. తమకు ఇష్టం లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, అందుకే మేయర్‌గా సునీల్‌రావును బలపర్చామన్నారు. అవినీతిపరుడైన సునీల్‌రావు స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. నమ్మిన వారిని మోసం చేసే వ్యక్తి సునీల్ అని దుయ్యబట్టారు. మచ్చలేని గంగులపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఊసరవెల్లిలా పార్టీలు మార్చే వ్యక్తిని బీజేపీ నాయకులు తమ పార్టీలోకి ఎలా తీసుకున్నారో వారికే తెలియాలన్నారు.
రాజీనామా చేయకుండా ఎలా చేర్చుకున్నారో సంజయ్ చెప్పాలి
తమ పార్టీలో చేరాలంటే పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ అనేక మార్లు చెప్పారని, మరి ఇప్పుడు సునీల్‌రావును మేయర్ పదవికి రాజీనామా చేయకుండా ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ప్రశ్నించారు. వారు పెట్టుకున్న నిబంధనలను వారే ఉల్లంఘించారని గుర్తు చేశారు. గతంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, మరి ఇక్కడ ఎందుకు రాజీనామా చేయించలేదో తెలపాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీలో నాయకుడికో న్యాయం అన్నట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి జరిగిందని తాను ఫిర్యాదు చేయడంతోపాటు బండి సంజయ్ కూడా గతంలో ఫిర్యాదు చేశారని, మరి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, 26 మంది కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.