“కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్ల సీడీఎఫ్ ప్రతి ఎమ్మెల్యే పేరిట ఇచ్చారు. కావాలంటే అప్పటి ప్రొసీడింగ్స్ కూడా చూపుతాం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్ ఇన్చార్జి పేరిట ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ జీవోల్లో కాంగ్రెస్ ఇన్చార్జి అని ఇచ్చారు. మరి ఈ నిధులు ప్రభుత్వానివా?, కాంగ్రెస్ పార్టీవా?” అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పథకాల అమలు విషయమై ప్రభుత్వ తీరును నిలదీశారు.
కరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొనగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ మంత్రులకు పలు ప్రశ్నలు సంధించారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ప్రభుత్వం అమలు చేయబోయే నాలుగు కొత్త పథకాల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు అదే రోజు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, కొత్త రేషన్ కార్డులు కూడా అదే రోజు ఇస్తామని అంటున్నారని, అయితే, రేషన్ కార్డు ఉంటేనే ఇండ్లకు అర్హులని అంటున్నారని, కొత్త రేషన్ కార్డు అదే రోజు తీసుకునే నిరుపేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ కట్టలేని పరిస్థితిలో ఉన్న పేదలకు ఇంటి స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని, ఇందుకు ఉపాధి హామీ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని అంటున్నారని, పట్టణాల్లో విలీనమైన గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని, అలాగే 20 రోజులు పని చేయాలనే నిబంధన కూడా తొలగించాలని కోరారు. ప్రతి గ్రామంలో 60 శాతం మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఫొటోలు తీసుకుని సర్వే చేస్తుంటే తమకు ఇండ్లు వచ్చాయనే భ్రమలో నిరుపేదలు ఉన్నారని, ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పరిశీలిస్తామని చెప్పారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా కేటాయించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాము కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచామని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల, కోరుట్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిల పేరిట ఎస్డీఎఫ్ నిధులు ఇస్తున్నారని, తన నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇన్చార్జి పేరిట ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ జీవోల్లో కాంగ్రెస్ ఇన్చార్జ్ అని ఇచ్చారని, మరీ ఈ పైసలు ప్రభుత్వానివా?, కాంగ్రెస్ పార్టీవా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లోనూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ఎస్డీఎఫ్ నిధులు ఎమ్మెల్యేల పేరిట ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో తక్షణమే దళిత బంధు రెండో విడుత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా దళితబంధు ఇవ్వవద్దని అంటారా? అని ప్రశ్నించారు. తాను గతంలో జడ్పీ మీటింగ్‌లో ప్రశ్నించినందుకు కేసు పెట్టారని, ఇప్పుడు కూడా కేసు పెడతారా? అని నిలదీశారు. కేశవపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్లు సర్వే జరుగుతుంటే నిరుపేదలు తమకు మంజూరైనట్లే భావిస్తున్నారని, నిజానికి కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఒక్కో డివిజన్లో 600 నుంచి వెయ్యి మంది ఇండ్లకు వెళ్లి ఫొటోలు తీసుకున్నారని, ఒక్క నగరంలోనే పది వేల మంది లబ్ధిదారులు ఉంటారని మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. జిల్లాలోని అన్ని అర్బన్ ఏరియాలకు కలిపి 12 వేల ఇండ్లు మాత్రమే ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని, ఎంత మందికి వస్తాయో క్లారిటీ ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఇండ్లు అందరికీ వస్తాయని, కానీ ఎప్పుడు వస్తాయనేది మనందరం కలిసి నిర్ణయించాలని కోరారు.
రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ హితవుపలికారు. ఎగవేసిన రెండు విడుతల రైతుభరోసాను ఇప్పుడు కలిపి ఇవ్వాలన్నారు. గతంలో గుంట, రెండు గుంటలున్న వారికి కూడా రైతుబంధు, రైతు బీమా ఇచ్చారని, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న వారిని కూడా రైతు కూలీలుగా గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఇండ్లు శిథిలమవుతున్నాయని, వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలోని నూకపల్లి హౌసింగ్ సొసైటీలో 5 వేల ఇండ్లు నిర్మిస్తే ఇంకా వెయ్యి ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని నిరుపేదలకు కేటాయించాలని కోరారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ సొసైటీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదని, వీటిని పూర్తి చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని కోరారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు షెట్టర్లు బిగిస్తే 20 నుంచి 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని సూచించారు.