Road accident | మంథని, ఆగస్టు 14: తోటి స్నేహితులతో అప్పటి వరకు సరదాగ గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ యమపాశంల మారి యువకుడిని బలిగొన్న సంఘటన మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామానికి చెందిన చిట్టం వెంకటేష్(30) అనే యువకుడు తన స్నేహితులైన మరో ముగ్గురితో కలిసి మంథనికి వచ్చారు.
ఉదయం నుంచి స్నేహితులతో సరదాగ గడిపిన వారంత తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వెంకటేష్ టీఎస్ 22 హెచ్ 9961 అనే నెంబర్ గల తన బైక్ పై మంథని మండలం ధర్మారం గ్రామానికి చెందిన తిప్పని అభిలాష్‌ను ఎక్కించుకొని గంగాపురిలోని సినిమా థియేటర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్నాడు. మంథని నుంచి పెద్దపల్లికి బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ గంగాపురి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న వెంకటేష్ లారీ వెనుక టైర్ కింద పడి పోగా ఆయన తల నుజ్జు నుజ్జయి అక్కడిక్కడే మృతి చెందాడు.
బైక్‌పై ఉన్న మరో యువకుడు అభిలాష్‌కు కాలు విరగగా అతన్ని గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించడంతో పాటు వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడికి తల్లి, చెల్లెలు ఉండగా సొంత ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చేతికి అందోచ్చిన కుమారుడు ఇలా రోడ్డు ప్రమాదంలో తనువు చాలించడంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోధించిన తీరును అందరినీ ఎంతగానో కలిచి వేసింది. తల్లి సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.