Dharmaram | ధర్మారం, మే 21 : రైతులు పంటల సాగులో శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తే అధిక లాభాలు గడించవచ్చని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీజీపీజేఏయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తిరుపతి మాట్లాడుతూ రైతులు యూరియా, రసాయన ఎరువుల వాడకాన్ని చాలావరకు తగ్గించాలని ఆయన సూచించారు. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వరి వంగడాలను వాన కాలంలో సాగు చేసి మంచి లాభాలు గడించవచ్చని ఆయన సూచించారు.
సేంద్రియ సాగు విధానం పాటించాలని అదేవిధంగా తొలకరి జల్లుల పడగానే సాగు భూముల్లో పచ్చి రొట్ట ఎరువులైనటువంటి జనుము, జీలుగా, పెసర ను వేసుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని రైతులకు ఆయన సూచించారు. మోతాదుకు మించి ఎరువులను వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటున్న విషయాన్ని రైతుల గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. రైతులు విశ్వ విద్యాలయం సిఫార్సు చేసిన సన్న రకాలైన తెలంగాణ సోనా, కునారం వరి 2 (KNM 1638), సిద్ది (WGL -44), HMT sona, జై శ్రీరామ్ వంటి వాటిని సాగు అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి సూచించారు. సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్ట్ ఎరువులతో భూసారం బాగా పెరిగి పంటలు అధిక దిగుబడులు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు, కటికనపల్లి క్లస్టర్ ఏఈఓ సతీష్, జీపీ కార్యదర్శి మహేందర్, రైతులు పాల్గొన్నారు.