ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ముసురు పట్టేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా వదలకుండా కురుస్తున్నది. అక్కడక్కడా మాత్రం దంచికొడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమై, రోడ్లన్నీ అధ్వానంగా మారుతుండగా, ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నది. మరోవైపు తెరిపిలేని వానతో వాగుల్లో స్వల్పంగా వరద వస్తుండగా, చెరువులు, కుంటలు సహా పలు ప్రాజెక్టులోకి నీరు చేరుతున్నది. సిరిసిల్ల జిల్లాలోని ఎగువ, మధ్య మానేరుతోపాటు కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయాలకు ఇన్‌ఫ్లో వస్తున్నది. విస్తారంగా పడుతున్న వానలతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర సమయాల్లో సాయం కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నది.
కరీంనగర్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వర్షాలు జూలైలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు నాలుగు రోజులుగా పడుతున్నాయి. శనివారం ముసురు పట్టింది. అక్కడక్కడా దంచి కొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆది, సోమవారాల్లో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో 0878 2997247 టోల్ ఫ్రీ నంబర్, నగర పాలక సంస్థ కార్యాలయంలో 9849906694 నంబర్‌తో మరో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా డయల్ 100కు కాల్ చేయాలని సీపీ గౌష్ ఆలం సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో మానేరు, మోయతుమ్మెద, చిలుక వాగుల్లో ప్రవాహం మొదలైంది. ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి శనివారం సాయంత్రం నుంచి 2020 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 6.490టీఎంసీల నీటి సామర్ధ్యం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు పరుగులు పెడుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.78 టీఎంసీల నీరు ఉంది. ఇక సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలువాగు ప్రవహిస్తుండడంతో మధ్యమానేరులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. 27.55టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 9.964టీఎంసీలు నిల్వ ఉంది.
భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టులో నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇల్లంతకుంట మండలంలో 3.50టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. వర్షాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. అప్రమత్తమైన అధికారులు ముంపునకు గురయ్యే గ్రామాలు, శిథిలావస్తకు చేరిన ఇండ్లలోని ప్రజలకు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన వెంకంపేట, శాంతినగర్, సంజీవయ్యనగర్ వార్డుల ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల పోచంపల్లి గ్రామాల మధ్యన ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కల ఒర్రెలో 15మంది కూలీలు చిక్కుకోగా, స్థానికులు తాళ్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు.