ధర్మపురి/ సారంగాపూర్/ అంతర్గాం, ఆగస్టు 16: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా జోరు వాన పడింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కుండపోత పోసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వరద ఉధృతితో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీర్పూర్ మండలం రోళ్లవాగు, అరగుండాల ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా వరద చేరుతున్నది. తుంగూర్, కండ్లపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఇరువైపులా మట్టి కూలిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ధర్మపురి-జగిత్యాల రహదారిపై ఆక్సాయిపల్లి గుట్ట మూల మలుపు వద్ద లోలెవల్ వంతెన పై నుంచి భారీగా వరద ప్రవహించడంతో రాకపోకలు బంద్ చేశారు. వాహనాలను మద్దునూర్, బుగ్గారం మీదుగా తరలించారు.
మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఊర చెరువు మత్తడి దూకడంతో కొండాపూర్ నుంచి విలాయతాబాద్కు వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెరిపిలేని వర్షంతో కోరుట్ల పట్టణ శివారులోని మద్దుల చెరువు, తాళ్లచెరువు మత్తడి వద్ద నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్లో వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ధర్మపురి, రాయపట్నం వద్ద గోదావరి నది ఉధృతిని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాల కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్ 966623438కు సమాచారం అందించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ సేవలు 24గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఎడతెరిపిలేని వర్షం, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడం, మరోవైపు కడెం ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తి 1.61లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో గోదావరి ఉధృతంగా పారుతున్నది. బీర్పూర్ మండలం కమ్మునూర్ వద్ద, ధర్మపురి వద్ద ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నది. గోదావరి స్నానాలకు వచ్చే భక్తులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన కడెం ప్రాజెక్టునుంచి 1.61లక్షల క్యూసెక్కులు, ఇతర వాగుల ద్వారా మొత్తంగా 2,15,501 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు 20 గేట్లు తెరిచి 66,807 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.